ఎన్నికలఅంశంగా వారసత్వ ఉద్యోగాల సమస్య

భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సింగరేణిలో వారసత్వ

ఉద్యోగాల పునరుద్ధరణ అంశం వేడెక్కుతోంది. రేపటి ఎన్నికల్లో ఇదే ప్రధాన ప్రచారాంశం కానుంది. వారసత్వ ఉద్యోగాలు రావాలంటే కార్మికవర్గమంతా ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొనాలని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తు వారసత్వ ఉద్యోగాల కోసం ఏఐటీయూసీ చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు కార్మికులు భాగస్వామ్యులు కావాలని కోరారు. కార్మికులకు మెరుగైన లాభాల బోనస్‌ చెల్లించేలా ఏఐటీయూసీ తనవంతు కృషి చేస్తుందన్నారు. అయితే ఈ ప్రచారాన్ని గుర్తింపు కార్మిక సంఘం తెబొగకాసం ఖండిస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఉద్ధేశంతోనే ఏఐటీయూసీ నాయకులు వారసత్వ ఉద్యోగాలపై మాట్లాడుతున్నారని తెబొగకాసం అధ్యక్షుడు బి.వెంకట్రావు పేర్కొన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింని ఆయన పేర్కొన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ, వీఆర్‌ఎస్‌ వారసులకు, తొలగింపు కార్మికులకు ఉద్యోగాలు కల్పించడం తెబొగకాసంతోనే సాధ్యమవుతుందన్నారు. కార్మికులు తెబొగకాసంపై నమ్మకం ఉంచి వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్తులను మెజార్టీతో గెలిపించాలని కోరారు.