ఎన్నికలు ఎప్పుడైనా ముందు గిరిజన గూడాల్లోనే
ప్రణాళికలు సిద్దం చేస్తున్న అధికారులు
ఆదిలాబాద్,జూన్6(జనం సాక్షి): పంచాయితీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఉమ్మడి జిల్లాలో తొలివిడత ఎన్నికలు ఏజెన్సీ ప్రాంతంలో జరిగేలా అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇంద్రవెల్లి, ఉట్నూర్,నార్నూర్, గాదిగూడ మండలాల్లో గిరిజన జనాభా ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు సిరికొండ, ఇచ్చోడ మండలాలు సైతం ఏజెన్సీ పరిధిలోకి వస్తాయి.రెండో విడతలో బోథ్, గుడిహత్నూర్, బజార్‌హత్నూర్, నేరడిగొండ, తలమడుగు మండలాల్లో ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. మూడో విడతలో ఆదిలాబాద్, మావల, బేల, జైనథ్, తాంసి, భీంపూర్ మండలాల్లో ఎన్నికలు జరుగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. మారుమూల గూడాల్లో ముందుగా ఎన్నికలు నిర్వహించి తరవాత మైదాన ప్రాంతాల్లో నిర్వహిస్తే సమస్యలు ఉండవని భావిస్తున్నారు. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరుగనున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు అందుబాటులో ఉన్న సి బ్బంది, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేం ద్రాల వివరాలను తయారు చేసేపనిలో పడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వార్డుకు ఒక పోలింగ్ కేం ద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు ఇద్దరి ఉద్యోగులు అవసరమవుతారని అధికారులు అంచనా వేశారు. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎన్నికల విధులు నిర్వహిస్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తులో భాగంగా పోలీసులు సైతం ఎక్కువ మొత్తంలో అవసరమవుతారు. ఉద్యోగులు, పోలీసుల సంఖ్యను పరిగణలోకి తీసుకుని జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. జిల్లాలో ఆరువేల బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉండగా మూడు విడతల్లో ఇవి సరిపోతాయని అధికారులు అంటున్నారు.