ఎన్నికలొస్తున్నాయి సిద్ధం కండి

తెలంగాణను దోచుకునేందుకే ఆంధ్ర పార్టీలు

త్వరలో తెలంగాణలో యాత్ర చేస్తా : కేసీఆర్‌

ఆవిర్భావ సభ విజయవంతం శ్రీతెరాస అధ్యక్షుడిగా కేసీఆర్‌

నిజామాబాద్‌/ఆర్మూర్‌, ఏప్రిల్‌ 27 (జనంసాక్షి) :

ఎన్నికలొస్తున్నాయి సిద్ధం కండి అని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఆర్మూర్‌లో నిర్వహించిన పార్టీ 13వ ఆవిర్భావ సదస్సులో ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రాంతాన్ని దోచుకునేందుకే ఉన్న ఆంధ్ర పార్టీలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ మేరకు త్వరలో పది జిల్లాలో యాత్ర చేస్తానని తెలిపారు. నిధులు, నీళ్లు, విద్య, వ్యవసాయం అన్ని రంగాల్లో దోచుకుంటున్న ఆంధ్రా పార్టీల పెత్తనం ఇంకెంతకాలం భరిస్తామో ఆలోచించాలని ప్రజలను చైతన్య వంతులను చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశాలున్నాయని, ఈలోగానే ప్రజలను చైతన్య వంతులను చేయాలని సూచించారు. తెలంగాణ ప్రజలను, ఆస్తులను, వనరులను ఎలా దోచుకుంటున్నాయో చెప్పి ఎన్నికల్లో ఆంధ్రాపార్టీలు చెప్పే మాయమాటలకు తలొగ్గకుండా చూడాలని కోరారు. త్వరలోనే తాను కూడా తెలంగాణా మొత్తం చుట్టివచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నా మన్నారు. తెలంగాణాకు

ప్రధాన అడ్డంకిగామారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మోకాళ్లపై యాత్ర చేసినా కూడా నమ్మే పరిస్థితిలేదన్నారు. బయ్యారంలోనే తాను స్టీల్‌ఫ్యాక్టరీని నిర్మిస్తానని చెప్పి తెలంగాణ ప్రజలను మరోసారి సిఎం మోసం చేస్తున్నాడని ఆరోపించారు. దేశంలో ఇప్పటికే అన్ని రాష్టాల్ల్రో జిల్లాల విభజన జరిగినా కేవలం ఆంధ్రాలోను, పశ్చిమ బెంగాల్లో నేటికి ఈకార్యక్రమం చేపట్టనే లేదన్నారు. తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించాక తెలంగాణాలోని పది జిల్లాలను 24కు పెంచుతామన్నారు. పిటెయిడ్‌ ప్రాజెక్టులు నిర్మించాలని నిబందనలున్నా ఆంధ్రా నేతలు తెలంగాణ వనరులను తరలించుకుపోయి నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణాలోనే ఉన్న బొగ్గును తరలించుకుని విజయవాడలో విటిపిపి, ఆర్‌టిపిపిలను నిర్మించారన్నారు. తెలంగాణలో ఏర్పాటుచేస్తామన్న నేదునూర్‌, శంకర్‌పల్లి ప్రాజెక్టులకు గ్యాస్‌ ఎందుకు కేటాయించడం లేదో చెప్పగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయంలో తాను మంత్రిగా ఉండేవాడినని, యాత్రకు వెళ్లేప్పుడు కమతాల గురించి చెప్పాలంటే అవేంటివి అని అడిగిన జ్ఞానం లేని సన్నాసి చంద్రబాబన్నారు. తెలంగాణాలో రెవెన్యూ చట్టం ప్రత్యేకంగా ఉందన్నారు. తెలంగాణాలో ప్రతిగ్రామంలో భూములను క్రమబద్దీకరణ చేసి ఏవ్యక్తికిసంబందించిన భూములను ఒకే స్థానంలో ఉండేలా రిజిస్టేష్రన్‌ ఫీజులు లేకుండానే చేస్తామన్నారు. ఒకే దగ్గర భూమి ఉండడం వల్ల ప్రతి కుటుంబానికి లబ్ధి జరుగుతుందన్నారు. చంద్రబాబు హయంలో అన్యాయమైన కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఉద్యోగుల నియామక ప్రక్రియ ప్రారంభమైందన్నారు. వారు రెగ్యులర్‌ వారు చేసే పనిలో ఏమైనా తేడా ఉందేమో పాలకులు చెప్పగలరా అని ప్రశ్నించారు. అందరిని రెగ్యులరైజ్‌ చేస్తామన్నారు. జనాభాలో సగం ఉన్న బిసిలకు చట్టసభల్లో రిజర్వషన్‌ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. గిరిజనులకు, ముస్లింలకు ప్రకటించిన విదంగా రిజర్వేషన్‌ కల్పిస్తామన్నారు. వృద్ధులు, వితంతువులకు ఇచ్చే పింఛన్లపై అర్రాస్‌లు పెడుతున్నాయని బాబు, వైసిపిలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో గ్రీన్‌ హౌజ్‌ వ్యవసాయం ప్రోత్సహిస్తామని కేసిఆర్‌ పేర్కొన్నారు. తాను ఫాంహౌజ్‌లో పడుకుంటున్నట్లు ఓ నయవంచక పత్రిక పిచ్చి కూతలు రాస్తోందని, అక్కడ పదెకరాలు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నానన్నారు. గ్రీన్‌హౌజ్‌ వ్యవసాయం వల్ల ఉత్పత్తి అధికంగా వస్తుందన్నారు. ఈవ్యవసాయంపై గుజరాత్‌, మహారాష్ట్ర, హర్యానాలు 70నుంచి 80శాతం సబ్సీడిలు ఇస్తున్నాయన్నారు. ఆంధ్రాలో గ్రీన్‌హౌజ్‌ వ్యవసాయానికి వీలు లేదని, అందుకే పట్టించుకోవడంలేదన్నారు. అదేఅవకాశం ఉంటే ఈపాటికే అమలు చేసి 90శాతం సబ్సీడిలు ఇచ్చేవారన్నారు. భూపాలపల్లితోపాటు గోదావరి పరిసర ప్రాంతాల్లో బొగ్గుగనులు అనేకం ఉన్నాయన్నారు. సింగరేణిలో డైమండ్‌ జూబ్లీ వేడుకల సందర్బంగా అన్ని పార్టీలు, ప్రభుత్వాలు 40, 50 బొగ్గు గనులు ఏర్పాటుచేస్తానని హావిూలు గుప్పించారని అయితే అనంతరం మరిచిపోయారన్నారు. అయిదు వేల మెగావాట్లవిద్యుత్‌ ఉత్పత్తి చేసి తీరుతామన్నారు. తెలంగాణాలో 81లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయని వీరి జీవన విధానంపై పూర్తిగా సర్వే చేయిస్తామని, ఆతర్వాత వారికి అవసరమైన వాటిని అందిస్తామన్నారు. భారత దేశంలో తలెత్తుకునే రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కేసిఆర్‌ ప్రకటించారు. తెలంగాణా సొత్తును దోచుకుంటున్న సీమాంద్ర నేతలు ప్రత్యేకరాష్ట్రం ఇచ్చేందుకు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. రెండు దశాబ్దాల క్రితమే సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 145 గ్రామాలకు సమగ్ర మంచినీటిని పంపిణీ చేస్తున్నామని అలాంటి పథకాన్నే తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తామన్నారు.