ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి


– ఈసీకి లేఖరాసిన కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప

బెంగళూరు, మే22(జ‌నం సాక్షి) : కర్ణాటకలో రాజకీయ ఉత్కంఠ సద్దుమణిగింది. అనేక నాటకీయ పరిణామాల అనంతరం జేడీఎస్‌ నేత కుమారస్వామి బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్‌ మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇటీవల కర్ణాటకలోని విజయపురాలో వీవీప్యాట్‌ మిషన్లను తీసుకెళ్లే 8 బాక్సులు ఓ షెడ్డులో లభించడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే యడ్యూరప్ప తాజా ఆరోపణలు చేశారు. ‘వీవీప్యాట్‌ బాక్సులు షెడ్డులో ఉండటం చూస్తుంటే కర్ణాటక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని స్పష్టమవుతుందని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని యడ్యూరప్ప ఈసీని కోరారు. ఎన్నికలకు ముందు కూడా తాము ఇలాంటి అక్రమాల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అయితే ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. గత ఆదివారం విజయపురాలోని మనుగులి గ్రామంలో ఈ వీవీప్యాట్‌ బాక్సులు కన్పించాయని దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారి సంజీవ్‌ కుమార్‌ స్పందించారు. షెడ్డులో లభించిన బాక్సులు ఎన్నికల కమిషన్‌వి కావని తెలిపారు. విజయపురాలో ఉపయోగించిన వీవీప్యాట్‌ మిషన్లను స్టాంగ్‌రూంలో భద్రపరిచినట్లు చెప్పారు. షెడ్డులో దొరికిన బాక్సులపై ఆరా తీస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
————————————