ఎన్నికల్లో పోటీకి ముషారఫ్‌ జీవితకాలం అనర్హుడు

పాక్‌ తీవ్రవాద వ్యతిరేక కోర్టు
ఇస్లామాబాద్‌,  ఏప్రిల్‌ 30 (జనంసాక్షి) : బేనజీర్‌ భుట్టో హత్యకేసులో నిందితుడైన పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు 14 రోజుల జుడీషియల్‌ రిమాండ్‌ను విధిస్తూ తీవ్రవాద వ్యతిరేక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రావల్పిండిలో ఉన్న కోర్టుకు ముషారఫ్‌ మంగళవారం హాజరుకావాల్సి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా మిగతా 2లోఆయనను హాజరు పరచలేకపోయిన్నట్టు ప్రాసిక్యూటర్‌ చౌదరీ జుల్ఫీకర్‌ అలీ తెలిపారు. ఆయనకు పాక్‌ తాలిబన్ల నుంచి ప్రాణ హాని ఉన్నందున సబ్‌ జైల్‌గా ప్రకటించిన ఆయన ఫాం హౌస్‌లోనే అధికారులు ఉంచారు. మే 14వ తేదీ వరకు కోర్టు ఈ కేసు వాయిదా వేసింది. కాగా ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ రాజకీయాల్లో ప్రవేశించాలన్న ముషారఫ్‌ ఆశలపై పెషావర్‌ హైకోర్టు నీళ్ళు జల్లింది. ఆయన ఎన్నికలలో పాల్గొనకుండా జీవితకాలంపాటు నిషేధం విధించింది. ప్రధాన న్యాయమూర్తి దోస్త్‌ మహ్మద్‌ ఖాన్‌ నేతృత్వంలోని నలుగురు సభ్యులు గల పెషావర్‌ హైకోర్టు ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల సంఘం తన నామినేషన్లను తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ను కూడా ధర్మాసనం తిరస్కరించింది. రాజ్యాంగాన్ని రెండుసార్లు అగౌరవపరచి, న్యాయమూర్తులను 2007లో నిర్భందించినందుకు ముషారఫ్‌పై ఎన్నికలలో పాల్గొనకుండా జీవితకాలం నిషేధం విధించినట్టు ధర్మాసనం పేర్కొంది. ఆయన జాతీయ, ప్రావిన్షీయల్‌ అసెంబ్లీలు, సెనేట్‌కు పోటీ చేయకుండా నిషేధం విధించింది. కాగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ఆపీల్‌ చేస్తామని ముషారఫ్‌ న్యాయవాదులు సాద్‌షీబ్లీ చెప్పారు.