ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం

కుటుంబాలను ప్రచారంలో దింపుతున్న నేతలు
హైదరాబాద్‌,నవంబర్‌13 (జనంసాక్షి ) : రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ మహిళల ఓట్లు కీలకంగా మారాయి. రాష్ట్రంలోని 63 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే, మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. దీంతో ఈసారి మహిళా ఓటర్లను ఆకట్టుకుంటేనే గెలుపు అవకాశాలు ఉంటాయని నాయకులు భావిస్తున్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు తమ భార్య, బిడ్డలు, కోడళ్లను రంగంలోకి దించారు. తమ పార్టీలోని మహిళా సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులను కలుపుకుని జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ నువ్వా, నేనా అన్నట్టుగా పరిస్థితి ఉండడంతో, ప్రచారంలో దూకుడు పెంచారు. కుటుంబ సభ్యులను ప్రచార కార్యక్రమాల్లోకి తీసుకురావాలని తమ యాక్టివ్‌ కార్యకర్తలను నాయకులు కోరుతున్నారు. దీంతో గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తమ భార్య, బిడ్డలను యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి తీసుకొస్తున్నారు. అందరినీ ఓ చోట చేర్చి ప్రచారం ఎలా చేయాలి.. ఏం మాట్లాడాలి.. తదితర వాటిపై ట్రైనింగ్‌ ఇస్తున్నారు. పార్టీ మేనిఫెస్టోలోని అంశాలు, పథకాలు, పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు జరిగే లబ్ధి వంటి వాటిపై అవగాహన కల్పించేలా ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్‌ ఉంటున్నాయి. స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళా
రిజర్వేషన్లు పెరిగాక, రాజకీయాల్లో మహిళల పార్టిసిపేషన్‌ పెరిగింది. మహిళా రిజర్వేషన్‌ ఉన్న ప్రతి చోటా, నాయకులు తమ భార్య లేదా బిడ్డలను పోటీకి దించుతున్నారు. ఇది ఓ రకంగా మహిళలు ఇంటి నుంచి బయటకొచ్చి, కొత్త విషయాలు నేర్చుకునేందుకు తోడ్పాటు అయింది. ఇంకో పదేండ్ల తర్వాత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన చట్టాన్ని కూడా చేసింది. ఏ నియోజకవర్గం మహిళలకు రిజర్వ్‌ అవుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అందుకే ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే అవుదామనుకుంటున్న నాయకులు, తమ భార్యకో, బిడ్డకో ఇప్పట్నుంచే రాజకీయాలు నేర్పించక తప్పని పరిస్థితి ఏర్పడిరది. ఇది కూడా ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో మహిళల పార్టిసిపేషన్‌ పెరగడానికి ఓ కారణమని నాయకులు చెబుతున్నారు.