ఎన్నికల రాజకీయాల్లో నేతలు
ఇప్పుడంతా ఎన్నిక సంవత్సరం. ఎవరే పనిచేసినా..ఏం మాట్లాడినా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఓటర్లను ఆకట్టుకునేలా కార్యక్రమాలు చేపట్టడం రివాజు. ఇందులో ఎవరిని కూడా తప్పు పట్టడానికి లేదు. అయితే అభివృద్ది అన్నది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా కార్యక్రమాలను కొనసాగించాలి. తెలంగాణ ఏర్పాటు ఒక చరిత్ర అయితే కోటి ఎకరాలకు సాగునీరందించే యజ్ఞం చేస్తున్నామని తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో తమకు రాజకీయాల కన్నా తెలంగాణ అభివృద్ది ముఖ్యమని గట్టు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను యజ్ఞంలా చేపడుతున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. కోటి ఎకరాల మాగాణి లక్ష్యంగా ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణ ప్రాజెక్టులన్నా తెలంగాణ ప్రజల సమస్యలన్నా రాజకీయం చేయడమే లక్ష్యంగా ఇతర పార్టీలు పెట్టుకున్నాయని, అందుకే వేగంగా జరుగుతున్న ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లి సమస్యలు సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతకాలం కరువుతో అల్లాడిన పాలమూరు జిల్లాలో ఇటువంటి పార్టీల నాయకులు ఉండటం ఇక్కడి ప్రజల దురదృష్టమని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి పాలమూరు రెండేండ్లలోనే పచ్చబడాలని, నడిగడ్డ గోస తీరాలని అన్నారు. 20 లక్షల ఎకరాలకు సాగునీరందించి, తూర్పు గోదావరిని మించిన ప్రాంతంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు గుర్తింపు తెస్తామని స్పష్టంచేశారు. మరోవైపు చేపట్టిన అనేక ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నాయి. కాళేశ్వరం మొదలు అన్ని ప్రాజెక్టులు, మిషన్ భగీరథ ముందుకు సాగుతున్నాయి. అయితే ఎపిలో పోలవరం చుట్టూ రాజకీయాలు ముసురుకున్నాయి. కేవలం కమిషన్ల కోసమే ప్రభుత్వం దీనిని చేపట్టిందని, పనుల అంచనాలు పెంచారని ఇలా రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు గతకొంతకాలంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పుంజుకుంది. ఎవరికి వారు కార్యక్రమాలను వేగంగా అమలు చేసే పనిలో పడ్డారు. ఎపిలో ఇప్పుడు కడప ఉక్కు తెరపైకి వచ్చింది. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఎంపి సిఎం రమేశ్ దీక్షకు దిగడం, దానిని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం చూస్తుంటే ఇక్కడ చిత్తశుద్ది కన్నా..రాజకీయ శుద్ది ఎక్కువగా కనిపిస్తోంది. గత నాలుగేళ్లుగా ఈ సమస్యపై కేంద్రంతో పోరాడి ఉంటే టిడిపి చిత్తశుద్దిని ఎవరు కూడా ప్రశ్నించేవారు కాదు. ఇకపోతే దేశంలో నాయకత్వ సమస్యలో ఉన్న కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్లో అంతకన్నా దారుణమైన స్థితిలో ఉంది. ఇక్కడ ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడంతో వాటిని ఎదుర్కొనే వ్యూహంలో విఫలం అవుతున్నాయి. కాంగ్రెస్‌ను వెన్నాడుతున్న పాపాలను కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఎపిలో చంద్రబాబు ఏదో చేశారని, తెలంగాణలో కెసిఆర్ మరేదో చేశారని చెబుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు నానాయాతన పడుతున్నారు. అన్నింటికి మించి తెలంగాణలో అవసరమైతే టిడిపితో పొత్తు పెట్టుకుంటామని గతంలో కేంద్రమాజీమంత్రి జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సొంతపార్టీలోనే ప్రకంపనలు సృష్టించాయి. తాజాగా టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ తహతహలాడుతోందని, ఇది దారుణమని మంత్రి హరీష్ రావు కూడా దుయ్యబట్టారు. మరి ఎపిలో కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెంటుకుంటారన్నది తెలియాల్సి ఉంది. తాజాగా రాహుల్‌ను రప్పించడం ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారు. నిజానికి ఎపిలో రఘువీరాకు పెద్దగా అసమ్మతి లేకపోవచ్చేమో కానీ తెలంగాణలో ఉత్తమ్ నాయకత్వంపై మాత్రం సమస్యలు ఉన్నాయి. రాష్ట్రవిభజన తరవాత రెండు రాష్ట్రాల్లో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్ గత వైభవం కోసం పాకులాడు తోంది. మరో ఆరునెలల్లో ఎన్నికలు రానుండడంతో ఇప్పటి నుంచే సంచి సర్దుకుంటోంది. విషయం ఏదైనాయాగీ చేయడమే ప్రధానం అన్న రీతిలో కార్యక్రమాలు చేస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడదే పరిస్థితిని కొనసాగి స్తోంది. ఎపిలో ప్రత్యేక¬దా, తెలంగాణలో ప్రాజెక్టులపై పోరు ప్రధానాంశాలుగా పోరు సాగించి చతికిల పడ్డాక రైతుల సమస్యలు జెండాకెత్తుకుంది. వైకాపా నిరంతరంగా పోరాడుతున్నా కాంగ్రెస్ అంతకుమించి కార్యక్రమాలను చేస్తూనే ఉంది. విభజన అపవాదు నుంచి ఏపీ కాంగ్రెస్ పార్టీ బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయిన ఏపి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే పార్టీని వీడారు. ఇకపోతే తెలంగాణలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ టిఆర్‌ఎస్‌ను విమర్శలు చేస్తున్నా పెద్దగా స్పందన కానరావడం లేదు. అందుకే ప్రధానంగా రైతుల సమస్యలను భుజానకెత్తుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇప్ప్పుడు నాయకత్వ సమస్య ఎదుర్కొంటోంది. ఉత్తమ్ నాయకత్వంపై అసంతృప్తులు పెరిగాయి. విమర్శలు చెలరేగుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో ఆయనను మార్చాలని ఆరోపణలు వస్తున్నాయి. ఈ దశలో మాజీ పిసిసి చీఫ్ డిఎస్ మళ్లీ కాంగ్రెస్‌లో చేరి పిసిసి పీఠం అధిష్టారన్న ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ గత పాపాలను విస్మరించి మాట్లాడితే ప్రజలు నమ్మరని గ్రహించడం లేదు. అందుకే గతాన్ని మరుగున పరచాలనుకున్న వారికి కూడా ప్రస్తుత పరిణామాలు మింగుడు పడటం లేదు. ఈ దశలో రాజకీయాల్లో అస్పష్టత కొనసాగుతోంది. ఎపిలో సవిూకరణాలు మారుతున్న తరుణంలో తెలంగాణలో టిఆర్‌ఎస్ మరింత బలోపేతం అవుతోంది. అందుకు చేపడుతున్న కార్యక్రమాలు, సిఎం కెసిఆర్ నాయకత్వమే ప్రధానంగా చెప్పుకోవాలి.