షియా ముస్లింలకు ఎమ్మెల్సీ ఇవ్వాలని షియా ముస్లిం కౌన్సిల్‌ డిమాండ్‌

ఖైరతాబాద్‌ (జనంసాక్షి) : సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షియా ముస్లింలకు గవర్నర్‌ కోటా (సామాజిక సేవ)లో ఎమ్మెల్సీ పదవితో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని షియా ముస్లిం కౌన్సిల్‌ డిమాండ్‌ చేసింది. ఆదివారం లక్డీకాపూల్‌లోని సంస్థ కార్యాలయంలో షియా సివిల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించింది. ఇందులో సుప్రీంకోర్టు మే 26న, రాష్ట్ర హైకోర్టు డిసెంబర్‌ 11న ఇచ్చిన తీర్పుల ప్రతులను చూపుతూ తమకు న్యాయం చేయాలని కోరారు. సంస్థ చైర్మన్‌, డైరెక్టర్‌ షబ్బీర్‌ అలీ మీర్జా, జాతీయ అధ్యక్షుడు హిదాయత్‌ అలీ మిర్జా, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ అభ్యర్థి మహ్మద్‌ అలీ హైదర్‌లు మాట్లాడుతూ.. తెలంగాణలో పదిన్నర లక్షల మంది షియా ముస్లింలు ఉన్నా.. రాజ్యాంగపరంగా తమకు రావాల్సిన హక్కులు దక్కడం లేదన్నారు. గవర్నర్‌ కోటా (సామాజిక సేవ)లో తమకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ ఆర్టికల్‌ 171 (5) కింద అర్హత కలిగిన అభ్యర్థి దరఖాస్తు చేసినా దానిని నిర్లక్ష్యం చేయడంపై తాము హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా.. తమకు అనుకూలంగా రెండు న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయన్నారు. ఇవి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికీ ఆదేశాలు అందాయని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించగా.. అక్కడినుంచి సైతం రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారని తెలిపారు. ఇదే విషయమై తాము రాష్ట్ర గవర్నర్‌ను ఓమారు కలిశామని, తీర్పు ప్రతులతో మరోమారు కలవనున్నామని తెలిపారు. తమ వర్గానికి అవసరం మేరకు శ్మశాన స్థలాలు లేవని, ప్రత్యేక తమకు విద్యాసంస్థలు, హాస్టళ్లు, సంక్షేమ సహాయం, రక్షణ, కర్బలా హౌజ్‌లు, గ్రంథాలయాలు, వారసత్వ ఆస్తుల పరిరక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తమ వర్గానికి ఎమ్మెల్సీ పదవితో పాటు సౌకర్యాలను కల్పించాలని లేనట్లయితే కోర్టు ధిక్కరణ కింద కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు సయ్యద్‌ అబిద్‌ హుస్సేన్‌, సీఈవో సయ్యద్‌ షకీల్‌ హైదర్‌, జాతీయ కన్వీనర్‌ సయ్యద్‌ హైదర్‌ రజానవ్వి, జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అహమ్మద్‌ హుస్సేన్‌, జాతీయ సహాయ కార్యదర్శి అస్కరి హుస్సేన్‌, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్‌ అసఘర్‌ అలీ ఖాన్‌, పీఆర్‌ఓ అక్బర్‌ అలీ మిర్జా తదితరులు పాల్గొన్నారు.