ఎన్నికల హావిూలకు కట్టుబడి ఉన్నా

రైతులకు ఇచ్చిన హావిూలను నెరవేరుస్తా
కుమారస్వామి స్పష్టీకరణ
బెంగళూరు,మే23( జ‌నం సాక్షి): రైతు సంక్షేమమే తన ప్రథమ ప్రాధాన్యమని జేడీఎస్‌ నేత కుమారస్వామి అన్నారు. వారికి ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను అమలు చేయడంతో పాటు, ఎన్‌ఇనకల హావిూల అమలుకు కట్టుబడి ఉన్నానని అన్నారు.  కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోయే ముందు   చాముండిహిల్స్‌లోని చాముండేశ్వరి దేవిని దర్శించుకున్నారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ… ప్రజల నమ్మకాన్ని పొందేందుకు తనకు ఈ రూపంలో అవకాశం వచ్చినట్లు భావిస్తున్నానని తెలిపారు. ఆరుకోట్ల మంది కర్ణాటక ప్రజలకు ఎటువంటి రాగద్వేషాలకు, పక్షపాతానికి తావు లేకుండా సేవ చేస్తానని చెప్పారు. కొన్ని విూడియా చానల్స్‌ రుణమాఫీపై కుమారస్వామి యూ-టర్న్‌ తీసుకుంటున్నారని ప్రచారం చేస్తున్నాయని.. ఆ ప్రచారం అవాస్తవమని ఆయన తెలిపారు. రుణమాఫీ హావిూపై తన నిర్ణయం మారదని కుమారస్వామి స్పష్టం చేశారు. జేడీఎస్‌ మ్యానిఫెస్టోలో ప్రకటించిన అన్ని హావిూల అమలుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. అయితే సంకీర్ణ ప్రభుత్వం అయినందు వల్ల అన్ని నిర్ణయాలు సమష్టిగా తీసుకోనున్నట్లు కుమారస్వామి తెలిపారు. ఇదిలావుంటే  ఇప్పటి వరకు నలుగురు ముఖ్యమంత్రులు రామనగర జిల్లా నుంచి గ్దదెనెక్కారు.  రామనగర జిల్లా నుంచి నెగ్గిన వారిలో ఐదో ముఖ్యమంత్రిగా కుమారస్వామి మరోమారు బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తొలి నలుగురూ పూర్తికాలం ఆ పదవిలో కొనసాగలేకపోవడం గమనార్హం. ఈ సంప్రదాయాన్ని కుమాస్వామి చెరిపేసి పూర్తికాలం ఆ పదవిలో ఉంటారా అన్నది కాంగ్రెస్‌ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంది.  1952లో ముఖ్యమంత్రిగా కెంగెల్‌ హనుమంతయ్య బాధ్యతల్ని స్వీకరించడంతో రామనగరం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆయన నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. ఎనిమిదో దశకంలో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించిన జనతాపార్టీ తరఫున రామకృష్ణ హెగ్డే అత్యున్నత పదవిని అలంకరించారు. ఆయన అసెంబ్లీలో ఏసభలో కూడా సభ్యుడు కానందున కనకపుర నుంచి ఉప ఎన్నికలో విధానసభకు ఎన్నికైనారు. 1988 వరకు ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో రామనగర నుంచి ఎన్నికైన దేవేగౌడ అధికారాన్ని చేపట్టారు. 1996లో ప్రధానిగా బాధ్యతల్ని స్వీకరించడంతో ముఖ్యమంత్రి స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో జె.హెచ్‌.పటేల్‌ ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించారు. 2006లో అనూహ్య రాజకీయ మార్పులు కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేశాయి. ఆయన ఆ పదవిలో 20 నెలలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఆయననే అదృష్టం వరించింది.
—–