ఎన్ని అడ్డంకులు సృష్టించిన కాళేశ్వరం ఆగదు

5

– మంత్రి హరీశ్‌

వరంగల్‌,మే13(జనంసాక్షి): సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌, టీడీపీలు ద్వంద్వ నీతికి పాల్పడుతున్నాయని… ఎవరు అడ్డుకున్న కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం కట్టితీరుతుందని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని మాదన్నపేట చెరువు వద్ద స్థానిక టీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి నిర్మించిన మిషన్‌కాకతీయ పైలాన్‌ను మంత్రి హరీష్‌రావు ఆవిష్కరించారు. నర్సంపేట నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన పాఖాల చెరువును, రంగరాయ చెరువును, మాదన్నపేట చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో హరీష్‌రావు మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గా న్ని తాగునీటి ప్రాజెక్టుల విషయంలో అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని హరీష్‌రావు తెలిపారు. పాఖాల చెరువుకు దేవాదుల నీటిని తీసుకు వస్తామని, నర్సంపేట నియోజకవర్గంలో చెరువులునిండిన తరువాత నీరువృథా కాకుండా 12 చెక్‌డ్యాంలను నిర్మించి నీటిని పొదుపు చేస్తా మని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌, వృద్దులకు పెన్షన్‌లు, కళ్యాణలక్ష్మి, తాగు నీటి ప్రాజెక్టులు చేపడుతుంటే.  . ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని హరీష్‌రావు అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులను ఆపడానికి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుండగా… కాంగ్రెస్‌ పార్టీ ఓ విధానం అంటూ లేకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఆ పార్టీ ధర్నాలు చేస్తుందని, ఎవరూ అడ్డువచ్చినా కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు కట్టితీరుతామని హరీష్‌రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రైతు బిడ్డని రైతులకోసం 25వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించారన్నారు. కాళేశ్వరం నుంచి ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువలో నీరు పారడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. కంతానపల్లి మునగకుండా తుపాకుల గూడెం వద్ద బ్యారేజీ నిర్మించి సంవత్సరం పొడవునా నీరు అందిస్తామన్నారు. సముద్రంలో కలుస్తున్న గోదావరి నీటిని రోజుకు మూడు టీఎంసీ నీటినైనా వినియోగించుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు.  దీంతో ఆనాటి కాకతీయ కాలువల్లో డీబీఎం 38, 45లో నీరు చేరుతుందన్నారు. పిఎంకెఎస్‌వైనుంచి దేవాదుల ప్రాజెక్టుకు 2వేల కోట్ల నిధులు తీసుకురావడానికి కేసీఆర్‌ ప్రధానమంత్రిని కలిసి చర్చించారన్నారు. 60 ఏల్ల పాలనలో ఏపార్టీ అధికారంలో ఉన్న ప్పటికి కూడా ఇలాంటి చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను మహారాస్ట, ఇటు ఆంద్రా నాయకులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.మేనిఫెస్టోలో లేని పథకాలను అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. మిషన్‌ కాకతీయతో సత్పలితాలు వస్తాయని ఊహించుకుంటేనే ఆనందంగా ఉందన్నారు. తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ లాంటి పనులను ప్రక్క ప్రభుత్వాలు ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు. నిరుపేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేని వారి జీవితాలు దుర్బరం కాకూడదనే ఉద్దేశ్యంతోనే జూన్‌నుంచి 220 ఇంగ్లీష్‌ విూడియం రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రారంభం చేస్తున్నారన్నారు. 60 ఏల్లపాలనలో 200 పాఠశాలలు ఏర్పాటుచేస్తే తాము రెండేల్లలోనే 220 పాఠశాలలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. మండలానిక ఓగోదాము మారుమూల ప్రాంతాలకు నిరంతరవిద్యుత్‌, విద్యార్థులు సన్న బియ్యం బోజనం పెన్షన్‌ తదితర పథకాలు ప్రజలనుంచి ఆదరణ వస్తుంటే టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపి ఇతర పార్టీలు చూసి ఓర్వలేకపోతున్నాయన్నారు.  అంతకుముందు మంత్రి పాకాల తూమును మత్తడిప్రాంతాన్ని నల్లబెల్లి మండంల, ఎర్రంగాయి చెరువులను పరిశీలించారు. ఈసందర్బంగా గిరిజన సంక్షేమమంత్రి చందూలాల్‌ మాట్లాడుతూ మాదన్నపేట చెరువను పర్యాటక రంగంగా అభివృద్ది చేయడానికి కావలసిన నిధులు మంజూరుచేస్తామన్నారు.  ఎంపి సీతారాంనాయక్‌, వరంగల్‌ మేయర్‌ రవిందర్‌, నర్సంపేట ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మిషన్‌ కాకతీయకు దేశమంతా ప్రశంసలు

మిషన్‌ కాకతీయకు దేశమంతా ప్రశంసలు వస్తున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అతి ఎత్తైన 45 అడుగుల మిషన్‌ కాకతీయ పైలాన్‌ను మాదన్నపేట చెరువుకట్టపై మంత్రులు హరీష్‌రావు, చందూలాల్‌ ఆవిష్కరించారు. అనంతరం దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతి గురించి అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు విూడియాతో మాట్లాడుతూ.. మిషన్‌ కాకతీయలో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. స్వయంగా ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని అభినందించారని తెలిపారు. నర్సంపేట రంగయ్య చెరువును గోదావరి జలాలతో నింపి 25 వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు పాకాల తూములను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వడం కోసం సీఎం కేసీఆర్‌ రూ. 25 వేల కోట్ల నిధులు కేటాయించారని గుర్తు చేశారు. దేవాదుల ద్వారా పాకాల చెరువును నింపుతామని చెప్పారు. పాకాల నుంచి రెండో పంటకు నీరందిస్తామని పేర్కొన్నారు. పాకాల తూములకు మరమ్మతులు చేసి, పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. మున్నేరులో 12 చెక్‌ డ్యామ్‌లను నిర్మిస్తామని చెప్పారు. ఖానాపురం మండలంలోని పాకాల చెరువును తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందులాల్‌ పరిశీలించారు. పాకాల చెరువు మత్తడి ప్రాంతం, తూములు, ఉద్యాన వనాన్ని పరిశీలించారు. పాకాల చెరువు చారిత్రక నేపథ్యం, నీటి సామర్థ్యం, సాగు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ సీతారాంనాయక్‌, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, తెరాస జిల్లా ఇంచార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, అధికారులు, స్థానిక నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోనే అతి ఎత్తైన 45 అడుగుల మిషన్‌ కాకతీయ పైలాన్‌ను మాదన్నపేట చెరువుకట్టపై మంత్రులు హరీష్‌రావు, చందూలాల్‌ ఆవిష్కరించారు. మాదన్నపేటలో మంత్రులు పర్యటించారు. కాకతీయ రాజులు తవ్వించిన గొలుసుకట్టు చెరువుల స్ఫూర్తితో ప్రారంభించిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి మిషన్‌ కాకతీయగా పెద్ద ఎత్తున చేపడుతోంది. ఈ పైలాన్‌ ను 45 అడుగులతో టీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించారు. కరీంనగర్‌ జిల్లా రామడుగు నుంచి తెప్పించిన రాయిని పైలాన్‌లా తీర్చిదిద్దారు. పైలాన్‌పై చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదో వివరించారు. మాదన్నపేట చెరువును మినీట్యాంక్‌బండ్‌గా, చెరువు రైతులకు ఉపయోగపడేలా పనులు చేస్తున్నారు. ప్రస్తుతం మిషన్‌ కాకతీయలో మాదన్నపేట చెరువుకు ఏడున్నర కోట్ల రూపాయలు మంజూరయ్యాయి.