ఎన్‌డీఏ ప్రధాని అభ్యర్థి లౌకికవాదే కావాలి

ఆయనెవరో ముందే ప్రకటించాలి
మోడీ వద్దేవద్దు
బెట్టు చేస్తే మాదారి మాదే..
జేడీయూ స్పష్టీకరణ
ఐదోసారి జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14 (జనంసాక్షి) :
ఎన్‌డీఏ ప్రధానమంత్రి అభ్యర్థి ముమ్మాటికీ లౌకికవాది అయి ఉండాలని జేడీయూ స్పష్టం చేసింది. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈమేరకు పార్టీ విధానాన్ని తెలియజెప్పారు. జేడీయూ అధ్యక్షుడిగా శరద్‌యాదవ్‌ ఐదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్‌డీఏ ప్రధాని అభ్యర్థిని భాగస్వామ్య పక్షాలు ఈ ఏడాది చివరి కల్లా ప్రకటించాలని కోరారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా తాము అంగీకరించబోమని జేడీయూ ముఖ్య నేతలు తేల్చిచెప్పారు. ఆయన సొంత రాష్ట్రంలో చెలరేగిన హింసను, అదీ ప్రత్యేక వర్గంపై జరిగిన మారణహోమాన్ని అరికట్టడంలో ఆయన విఫలమయ్యాడని, బీజేపీ ఎంతగా చెప్పినా ఆయన లౌకికవాది కాబోరని నేతలు పేర్కొన్నారు. బీజేపీ నేతలు తమ మాట విడకుండా నరేంద్రమోడీనే ప్రధాని చేయాలని బెట్టుచేస్తే తమ దారి తాము చూసుకుంటామని స్పష్టం చేశారు. శరద్‌యాదవ్‌ మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామిక లౌకికవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది తమ అభిమతని అన్నారు. 2014 ఎన్నికలే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ మాట్లాడుతూ, తాను ప్రధానమంత్రి రేసులో లేనని స్పష్టం చేశారు. తనను ప్రధాని అభ్యర్థిగా కొందరు ముందుకు తెస్తున్నా.. ఆ పదవిపై ఆసక్తి లేదన్నారు. జనతాదళ్‌ నేతలు దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌కు తదనంతరకాలంలో ఎదురైన పరిస్థితులు తనకు తెలుసన్నారు. ప్రధాని అభ్యర్థిత్వంపై తనకు భ్రమలు లేవన్నారు. ప్రధాని అభ్యర్థిగా బీజేపీ నరేంద్రమోడీని ప్రకటిస్తే ప్రతికూల ఫలితాలు ఎదురుకావడం ఖాయమన్నారు. అయినా ప్రధాని అభ్యర్థి ఎవరో ఇప్పటికిప్పుడే తేల్చాల్సిన అవసరం లేదన్నారు.