ఎపిలో రోడ్డు వార్‌

గుంతలు పూడ్చేందుకు జనసేన వ్రమదానం
పవన్‌ కార్యక్రమానికి ముందే అధికారుల అలర్ట్‌
ధవళేశ్వరం బ్యారేజీపై గుంతలు పూడ్చిన అధికారులు
రూటు మార్చిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌
రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయన్న సోమిరెడ్డి
అమరావతి/రాజమండ్రి,అక్టోబర్‌1 (జనం సాక్షి) : ఎపిలో రోడ్డు వార్‌ జరుగుతోంది. జనసేన పిలుపుతో రోడ్ల మరమ్మత్తులకు ప్రభుత్వం పూనుకుంది. గతకొంత కాలంగా జనసేన రోడ్లపై గుంతలు పూడ్చాలని పిలుపునిచ్చింది. గాంధీ జయంతి రోజు అక్టోబర్‌ 2న ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీపై జనసేన ఆధ్వర్యంలో శ్రమదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఇరిగేషన్‌ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తూర్పుగోదావరి జిల్లా హుకుంపేట బాలాజీపేట నుంచి హుకుంపేటకు వేదికను మార్చుకున్నారు. బాలాజీపేట కనకదుర్గమ్మ గుడి దగ్గర జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ శ్రమదానం చేయనున్నారు. అధ్వానంగా తయారైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి రోడ్డు మరమ్మతుల కోసం జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అక్టోబరు 2న శ్రమదానం చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి ఇరిగేషన్‌ అధికారులు అనుమతి నిరాకరించారు. ‘ఇది సాధారణంగా జనం రాకపోకలు సాగించే రోడ్డు కాదు. ఇది ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రోడ్డు కూడా కాదు. దీనిని ఇరిగేషన్‌ శాఖ మాత్రమే సాంకేతిక పరిజ్ఞానంతో మరమ్మతులు చేయవలసి ఉంది. పైగా వరదల సమయం. గోదావరి ఉధృతంగా ఉంది. రేపోమాపో మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇక్కడ ఎటువంటి అనుమతి ఇచ్చేది లేదని ఇరిగేషన్‌ ఎస్‌ఈ తెలిపారు. ఇదిలావుంటే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ శ్రమదానం చేస్తారనే వార్తలతో ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌కి జలవనరులశాఖ అధికారులు తూతూ మంత్రంగా మరమ్మతులు చేపట్టారు. సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ లేకుండానే బ్యారేజ్‌పై కాంక్రీట్‌తో గోతులను మొక్కుబడిగా పూడ్చారు. అధికారుల తీరుపై వాహనదారులు మండిపడుతున్నారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ శ్రమదానం చేసి తీరుతారని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. జనసేనాని నేటి శ్రమదానం కార్యక్రమంపై అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతుంది. జనసేన అధినేత శ్రమదానం కార్యక్రమానికి ప్రకటించిన ప్రతి రోడ్డులోనూ అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేస్తున్నారు. తాజాగా రాజమండ్రి బాలాజీపేట బొమ్మూరు రోడ్డు దగ్గర శ్రమదానం చేసి మరమ్మత్తులు చేస్తామని జనసేనాని ప్రకటించిన కొద్ది గంటల్లోనే అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.
ఇప్పటికే జనసేన ప్రకటించిన అనంతపురం, ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌లపై మరమ్మత్తులు చేసిన ఆర్‌/బీ అధికారులు తాజాగా రాజమండ్రి బాలాజీపేట బొమ్మూరు రోడ్డు మరమ్మత్తులను హుటాహుటిన చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో రేపటి జనసేన శ్రమదానం కార్యక్రమంపై సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది.మరోవైపు ఏపీలో రోడ్లన్నీ నరకకూపాల్లా మారాయని, ఆర్‌ అండ్‌ బీ శాఖ మూతపడిరదని టీడీపీ నేత సోమిరెడ్డి
చంద్రమోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ వాహనదారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా ప్రభుత్వంలో చలనంలేదని తప్పుబట్టారు. ఎవరు డబ్బులిస్తే వారికే కాంట్రాక్టులు, చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఆర్థికశాఖ అధికారి సత్యనారాయణ 15శాతం చెల్లింపులు చేస్తేనే బిల్లులు చెల్లిస్తున్నారని, ఏ ఫైల్‌ క్లియర్‌ చేయాలన్నా 90 రోజుల సమయం తీసుకుంటున్నారని తెలిపారు. ప్యాచ్‌ వర్క్‌కు జనసేన ముందుకొస్తే ప్రభుత్వానికి ఇబ్బందేంటని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు.