ఎపి అక్రమ నీటి వాడకాన్ని అడ్డుకోండి
కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
హైదరాబాద్,అగస్టు7(జనంసాక్షి): కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీరు తరలించకుండా ఆపాలని కేఆర్‌ఎంబీకి విజ్ఞప్తి చేసింది. నాగార్జున సాగర్ నీటి అవసరాల కోసం తరలింపును ఆపాలని కోరింది. ఏపీ తన పరిమితికి మించి నీరు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఆంధప్రదేశ్ 25 టీఎంసీల నీటిని తరలించిందని లేఖలో పేర్కొన్నది. నిబంధనల ప్రకారం ఏపీ 10.48 టీఎంసీలే తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కేఆర్‌ఎంబీతో పాటు కేంద్ర జలశక్తి శాఖకు కూడా లేఖ ప్రతిని రాష్ట్ర ప్రభుత్వం పంపింది.