ఎపి విభజన చట్టం చెల్లదు

పార్లమెంటులో టిడిపి చర్చించాలి

ఆనాటి అన్యాయాలకు అద్వానీ మూగసాక్షి

ఉండవల్లి అరుణ్‌ కుమార్‌

రాజమండ్రి,జూలై5(జ‌నం సాక్షి ): రాష్ట్రం కోసం ఢిల్లీలో పోరాడే అవకాశం ఏపీ సీఎం చంద్రబాబుకు లభించిందని ప్రముఖ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు ఓ బహిరంగ లేఖ రాశారు. నాడు పార్లమెంట్‌ లో తలుపులు మూసి ఏపీ విభజన చేశారన్న మోడీ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీలు లోక్‌ సభలో చర్చకు పట్టుబట్టాలని కోరారు. రాజ్యాంగబద్ధంగా విభజన జరగలేదని నిరూపించేందుకు తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, ఆ వివరాలను టీడీపీ ఎంపీలకు ఇస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయమై పార్లమెంట్‌ లో చర్చ జరిగితే కాంగ్రెస్‌, బీజేపీలలో దోషి ఎవరో తేలిపోతుందని అభిప్రాయపడ్డారు.ఏపీ విభజన చట్టం చెల్లుబాటు కాదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్‌లో పోరాటం చేయాలని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సూచించారు. రాష్ట్ర విభజనను బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ కూడా సమర్థించలేదని గుర్తుచేశారు. పార్లమెంట్‌లో ఎన్ని దారుణాలు

జరిగాయో అద్వానీకి తెలుసునని, ఇప్పుడు ఇందుకు సంబంధించి నోటీసులిస్తే అద్వానీ అన్ని విషయాలు చెబుతారని అన్నారు. రాజమహేంద్రవరంలో ఉండవల్లి గురువారం విూడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని సభలో లేవనెత్తిన అంశంపై చర్చ జరగాలన్నారు. ప్రధాని చెప్పిన మాటలపై నేతలు వివరణ కోరాలని పేర్కొన్నారు. ‘సభ తలుపులు మూసి విభజన చట్టాన్ని ఆమోదింపచేశారు. సభ్యులు ఎవరూ లేరని తెలిసి విభజన బిల్లును ఎలా ఆమోదించారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ విడిపోయింది. కనుక లోక్‌సభలో టీడీపీ ఎంపీలు మాట్లాడటానికి వాళ్లకు ఏం అభ్యంతరం ఉంది. సభలో జరిగిన దారుణాలు ఆద్వానీకి తెలుసు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్‌లో రాష్ట్రనేతలు నిలదీయాలి. జరిగిన అన్యాయంపై నిలదీయకుంటే .. ప్రజా ప్రతినిధులుగా ఉండటానికి నేతలు అనర్హులు. ఏపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ నిర్ణయించాలి. కానీ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రాకుండా చేస్తున్నారు. పార్లమెంట్‌లో ఏ నిమిషం ఏం జరిగిందో రికార్డు ఉంటుంది. విూడియాకు పార్లమెంట్‌ రికార్డులన్నీ నేనే ఇస్తాను. విభజన బిల్లుపై సభలో జరిగిన వాటిపై అందరికీ మెయిల్స్‌ పంపాను. సభలో కేంద్రం పెద్దలను నిలదీయాలని చెప్పా. కానీ ఎవరూ అలా చేయడం లేదు. ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం నేడు ఏపీ సీఎం చంద్రబాబు (టీడీపీ ఎంపీలు)కు ఉంది. విూకు బాధ్యత ఉందని భావిస్తే దయచేసి ఇప్పుడైనా పార్లమెంట్‌లో ప్రశ్నించాలని’ ఉండవల్లి చెప్పారు.