ఎఫ్‌డీఐలకు మేమూ వ్యతిరేకమే..

కాంగ్రెస్‌, ఎస్పీలపై మాయా నిప్పులు

ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు

యూపీఏకు మద్దతు విషయంపై నేడు నిర్ణయం
లక్నో, అక్టోబర్‌ 9 (జనంసాక్షి): కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలపై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయిన ధ్వజ మెత్తారు. కాంగ్రెస్‌, ఎస్పీలు దళితులకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని, దళిత వ్యతిశ్రీ ంళిక పార్టీలకు తమ మద్దతు ఉండదని స్పష్టం చేశారు. యూపీఏకు మద్దతు కొనసా గించేది, లేనిది బుధ వారం జరిగే పార్టీ సమా వేశంలో తుది నిర్ణయం తీసుకుంటా మన్నారు. రిటైల్‌ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను బీఎస్పీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. దీనివల్ల రైతులకు, చిల్లర వర్తకులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్త ంచేశారు. అయితే, రైతులకు మేలు జరిగేలా ఉంటాయంటే వాటిపై పునరా లోచన              చేస్తామన్నారు. 2014 కంటే ముందే లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశముందని మాయావతి జోస్యం చెప్పారు. కాన్షీరాం జయంతి సందర్భంగా బీఎస్పీ మంగళవారం లక్నోలో ‘మహా సంకల్ప యాత్ర’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించింది. మార్చ్‌ నెలలో జరిగిన యూపీ ఎన్నికల అనంతరం బీఎస్పీ నిర్వహిస్తున్న తొలి కార్యక్రమమిది. కాన్షీరాం జయంతిని పురస్కరించుకొని మాయావతి 2014 ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ర్యాలీ సందర్భంగా మాయావతి ప్రసంగిస్తూ.. సమాజ్‌వాదీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందని ఉత్తరప్రదేశ్‌ ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని అన్నారు. ఇలాంటి రోజు వస్తుందని అధికారం కోల్పోయిన మరునాడే తాను చెప్పిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన ఐదేళ్ల పాలనలో ఉత్తరప్రదేశ్‌ అభివృద్ధి బాటలో పయనించిందని, గతంలో కంటే శాంతిభద్రతల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేదన్నారు. ఎస్పీ సర్కారు హయాంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని ధ్వజమెత్తారు. గుండాలు అధికారం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని మాయా విమర్శించారు. అంబేద్కర్‌ సహా ఇతర దళిత నేతల పేర్లతో కొనసాగుతున్న సంక్షేమ పథకాల పేర్లను, పట్టణాల పేర్లను అఖిలేశ్‌ ప్రభుత్వం మార్చేస్తోందని మండిపడ్డారు. దళిత నేతలను అవమాన పరుస్తూ.. ఎస్పీ చీఫ్‌ ములాయం సింగ్‌, ఆయన కుటుంబ సభ్యులు వారి గోతులను వారే తవ్వుకుంటున్నారని విమర్శించారు. కాన్షీరాం వర్ధంతి రోజును సెలవు దినంగా ప్రకటించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాయావతి మండిపడ్డారు. వర్ధంతి రోజున సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మెనార్టీల సంక్షేమాన్ని యూపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని మాయా ధ్వజమెత్తారు. ‘ముస్లింలు, యాదవ వర్గాలను మేం ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. కానీ, సమాజ్‌వాదీ ప్రభుత్వం ఇంతవరకు ఆయా వర్గాలకు చేసిందేవిూ లేదు’ అని విమర్శించారు. ఎస్పీ హయాంలో అవినీతి తారాస్థాయికి చేరిందని మాయా ఆరోపించారు. ‘యూపీలో మహిళలకు రక్షణ లేదు. లంచం లేకుండా ఏ పని జరగడం లేదు’ అని దుయ్యబట్టారు. తాము యువతకు ఉపాధి కల్పించామని, నిరుద్యోగ భృతి చెల్లించామన్నారు. యువతకు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు ఇస్తామని హావిూ ఇచ్చి అధికారంలోకి అఖిలేశ్‌ సర్కారు.. వాటిని షాపుల్లో పెట్టి విక్రయిస్తోందని విమర్శించారు. బీజేపీతో కలిసి పని చేసే ప్రసక్తే లేదని మాయావతి తేల్చిచెప్పారు. యూపీ ఎన్నికల్లో బీఎస్పీని గద్దె దించేందుకు బీజేపీ కాంగ్రెస్‌తో చేతులు కలిపిందని ఆరోపించారు. ‘ఉత్తరప్రదేశ్‌ ప్రజలు ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలకు కాంగ్రెస్‌, బీజేపీలదే బాధ్యత. బీఎస్పీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఆ పార్టీలు భయపడ్డాయి. ఆ రెండు పార్టీలు ఎస్పీతో రహస్యంగా చేతులు కలిపి బీఎస్పీకి వ్యతిరేకంగా పని చేశాయి. కాంగ్రెస్‌, బీజేపీ పరస్పరం సహకరించుకోవడం వల్లే బీఎస్పీ మరోసారి అధికారంలోకి రాకుండా పోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ మూడు పార్టీలకు యూపీ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని’ మాయావతి అన్నారు. మతతత్వ శక్తులను బీఎస్పీ ప్రోత్సహించదన్నారు.