ఎఫ్‌డీఐలతో చిల్లర వర్తకుల పొట్టకొట్టేందుకు కంకణం
చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలకు అనుమతించి చిల్లర వర్తకుల పొట్టబెట్టేందుకు కంకణం కట్టుకొన్న కేంద్రం ఈ మేరకు వివిధ పార్టీలను బాగానే మేనేజ్ చేసింది. విందు రాజకీయాలతో తన చాకచక్యాన్ని ప్రదర్శించింది. చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలకు అనుమతిచ్చే విషయంలో లోక్‌సభలో చర్చ జరిపేందుకు యూపీయే కసరత్తు ప్రారంభించింది. డీఎంకే ఇచ్చిన భరోసాతోపాటు లల్లూ, మిగతా భాగస్వామ్య పక్షాల అండదండలతో యూపీయేలో ఆత్మవిశ్వాసం పెరిగినట్టు కనబడుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత వేదిక అయిన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. యూపీఏ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటి వెలుగులోకి రావటం, వీటిపై ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకుని అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడం సర్వసాధారణమైంది. వర్షాకాల సమావేశాలు కోల్ కుంభకోణంలో కొట్టుకుపోగా, శీతాకాల సమావేశాలైనా సజావుగా జరుగుతాయా? లేదా అనే సందేహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారం రోజుల నుంచి విడవకుండా ప్రతిష్టంభన వెన్నాడుతూనే ఉంది. ఎఫ్‌డీఐలపై 184వ నిబంధన ప్రకారం ఓటింగ్‌తో కూడిన చర్చకే ప్రధాన పక్షమైన బీజేపీ పట్టుబడుతుండగా, ఇన్నాళ్లు ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అయితే ఎఫ్‌డీఐలకు అనుకూలంగా ఓటు వేసే సమస్యే లేదు. ఎందుకంటే మమతా బెనర్జీ ఆది నుంచి ఎఫ్‌డీఐలను వ్యతిరేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా వామపక్షాలు కూడా ఇదే బాటపట్టే అవకాశం ఉంది. ఏ పార్టీ కూడా ఓటింగ్‌లో పాల్గొంటే అనుకూలంగా ఓటు వేసి ప్రజల్లో అభాసుపాలయ్యే ధైర్యం చేయదు. డీఎంకే ఇచ్చిన స్పష్టమైన హామీ తరువాత, మిగిలిన భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తరువాతే లోక్‌సభలో ఓటింగ్‌తో కూడిన చర్చకు సిద్ధమని ప్రభుత్వం సంకేతాలు ఇవ్వడం గమనార్హం. మెజారిటీ సభ్యులు ఎఫ్‌డీఐకి వ్యతిరేకంగా ఓటు వేసినట్లయితే ప్రభుత్వం దానికి కట్టుబడి ఉండాలి. ఆ నిర్ణయానికి అనుగణంగా ప్రభుత్వం మళ్లీ ఎఫ్‌డీఐలపై నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది. అయితే సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనేక పార్టీలు ఈ అంశంపై ఓటింగ్ లేకుండానే చర్చకు సానుకూలత వ్యక్తం చేశాయి. పార్లమెంట్ సజావుగా సాగాలని ప్రతిపార్టీ కోరుకుంటోంది. కాని ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఓటింగ్‌తో కూడిన చర్చపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సభా పతులకే యూపీయే విడిచిపెట్టడం జరిగింది. ఓ విధంగా పాలనాపరమైన నిర్ణయంపై ఓటింగ్‌తో కూడిన చర్చకు అంగీకరించడం ద్వారా ప్రభుత్వం ఇదివరకు ఎన్నడూ లేని దుస్సంప్రదాయానికి నాంది పలికినట్టే. బీజేపీతో పాటు వామపక్షాలు, టీడీపీ, బీజేడీ, ఏఐడీఎంకేలు ఎఫ్‌డీఐలు ఓటింగ్‌కు పట్టుపడుతున్నాయి. ఓటింగ్ జరిగితే లోక్‌సభలో సునాయసంగానే గట్టెక్కగలిగిన రాజ్యసభలో గడ్డుపరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. రాజ్యసభలో యూపీయేకు సొంత బలం లేదు. ఓటింగ్ జరిగితే చిక్కును ఎదుర్కొవాల్సి వస్తుంది. 244 మంది సభ్యులున్న రాజ్యసభలో యూపీయేదాని మిత్ర పక్షాకలకు 95 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. బయటి నుంచి మద్దతు ఇచ్చే బహుజన్ సమాజ్‌పార్టీకి 15 మంది, సమాజ్‌వాది పార్టీకి 9 మంది సభ్యులున్నారు. ఈ రెండు పార్టీలు ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు వేస్తాయి.కాగా లోక్‌సభలో ప్రస్తుతం యూపీయేకు 265 మంది ఎంపీల మద్దతు ఉంది. సమాజ్‌వాది పార్టీ 22, బహుజన్‌సమాజ్‌వాది పార్టీ 21 సభ్యుల సంఖ్యను కలుపుకుంటే మొత్తం 300పైగానే ఉంటుంది. ఈ ధీమాతోనే యూపీయే ఓటింగ్‌కు ముందుకు వచ్చింది. చిల్లర వర్తకుల ఉనికినే ప్రశ్నార్థకం చేసే ఎఫ్‌డీఐలపై అర్థవంతమైన చర్చ జరిగినప్పుడే ఎలాంటి ఓటింగ్ జరిగినా ప్రజలకు ప్రయోజనం. అలాగే ప్రజల ప్రయోజనాన్ని ఎలాంటి నష్టం వచ్చిన అన్ని పార్టీలు కలిసి సంఘీభావం ప్రకటించడం విలక్షణమైన సంప్రదాయం. ప్రజలందరికీ లబ్ధి చేకూర్చే వ్యవహారాల్లో రాజకీయ ప్రయోజనాల పేరిట మోకాలడ్డితే ప్రజల్లో చులకన అవుతారు. గతంలో వలే సమావేశాల వివరాలు ప్రింట్ మీడియాలో వచ్చే వరకు ప్రజలకు తెలిసేవి కావు. కాని ఈనాడు గోడలకు చెవులున్నట్లు చుట్టూ ఎలక్ట్రానిక్ మీడియా కళ్లు ప్రజాప్రతినిధులపై నిఘా పెట్టి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులందరూ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే ప్రజలు వారిని గౌరవంతో చూడగలరు. అరుపులు, కేకలతో అసలు విషయానికే ఎసరు పెట్టడం క్షంతవ్యం కాదు. అదే విధంగా సభ సజావుగా ప్రశాంత వాతావరణంలో చర్చ జరిగేలా చర్య తీసుకోవడానికి స్పీకర్ తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సభలో నిరసన ధ్వనులు వినిపిస్తూనే ఉంటాయి. కాని అవి కొంత వరకే పరిమితం కావాలి. అర్థవంతమైన చర్చలు వాదోపవాదాలు ప్రతిపక్ష నిర్మాణాత్మక విమర్శలతో ప్రజలలో విస్తృతమైన చర్చకు దారితీసిన ఎఫ్‌డీఐల అనుమతి నిర్ణయంపై ప్రతిష్టంభన తొలగి సభ సజావుగా జరుగుతుందని ఆశిద్దాం.