ఎమ్మెల్యేలు కోరుకుంటే.. మళ్లీ రేవంత్‌రెడ్డే సీఎం
` బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నాం
` క్రమశిక్షణ విషయంలోనూ ఎక్కడా రాజీపడం
` కాళేశ్వరంపై సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించాలి
` పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
హైదరాబాద్(జనంసాక్షి): బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. కార్యకర్తలను కూడా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కామారెడ్డిలో బహిరంగ సభ ఏర్పాటుకు సీఎం ఆదేశాలతో సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ‘’ వచ్చే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోనే ముందుకు వెళ్తాం. ఎమ్మెల్యేలు కోరుకుంటే రేవంత్‌రెడ్డే మళ్లీ సీఎం అవుతారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుపుకొని వెళ్తున్నాం. క్రమశిక్షణ విషయంలోనూ ఎక్కడా రాజీపడటం లేదు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించాలి. సీబీఐలో కొంత లొసుగులు ఉన్నాయి. అది వాస్తవం’’ అని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.