ఎమ్మెల్సీ కవిత చొరవ..
జిల్లాలో అభివృద్ధి పనులకు రూ.2.30 కోట్లు విడుదల
నిజామాబాద్,డిసెంబర్16 (జనం సాక్షి) : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో నిజామాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. ఆమె నిధులు విడుదల చేయించడంతో పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు. వివిధ గ్రామాలు, మండలాల్లో అభివృద్ధి పనులకు భారీగా నిధులు విడుదల చేయడంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవితకు జిల్లా ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం ద్వారా నిజామాబాద్ అర్బన్, బోధన్, బాల్కొండ నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. బోధన్ మండలంలోని మినార్ పల్లి గ్రామంలో రూ.50 లక్షలతో కమ్యూనిటీ హాల్, నవీపేట్ మండలం పొతంగల్ గ్రామంలో రూ.50 లక్షలతో పాఠశాల భవనం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్సీ కవిత నిధులు విడుదల చేయించారు. బోధన్ మున్సిపాలిటీలోని 37 వ వార్డులో రూ. 10 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సైతం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నిజామాబాద్ అర్బన్‌లోని 42 వ డివిజన్‌లో గల కమ్యూనిటీ హాల్ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.10 లక్షలు, 6, 15, 16 ,25, 50 వ డివిజన్ లలో ఒక్కో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 5 లక్షలు, డివిజన్ 16 లోని మెట్టు కుమార్ గల్లీలో గల మున్నూరు కాపు సంఘ భవనంలో వివిధ పనుల నిమిత్తం రూ.5 లక్షల నిధులు విడుదల అయ్యాయి. దీంతో పాటు బాల్కొండ మున్సిపాలిటీలో వివిధ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.25 లక్షలు, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5 లక్షలు, ముప్కాల్ మండలం కొత్తపల్లి గ్రామంలో వివిధ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.30 లక్షల నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.