ఎర్రజొన్న,పసుపుకు గిట్టుబాటు ధరలు కల్పించాలి
తక్షణం సిఎం కెసిఆర్ స్పందించాలి: తాహిర్
నిజామాబాద్,ఫిబ్రవరి14(జనంసాక్షి): రైతుపక్షపాతినని, తమ పథకాలను కేంద్రం, ఇతరరాష్ట్రాలు కాపీ కొడుతున్నాయంటున్న సిఎం కెసిఆర్ తోణం ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రైతులు ఆందోళన చేస్తున్నా పలకరించడానికి కనీసం ఒక్క మంత్రి కూడా లేడని డిసిసి అధ్యక్షుడు తాహిర్బిన్ హుదాన్ అన్నారు. పసుపునకు క్వింటాలుకు రూ.15,000, ఎర్రజొన్న క్వింటాలుకు రూ.3,500 చెల్లించాలన్నారు. రైతుల న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్న నాయకులపై పెట్టిన కేసులు రద్దు చేయాలని, 144 సెక్షన్ ఎత్తివేయాలని కోరారు. రైతులు పండిస్తున్న పసుపు, ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని కాపాడుతామని వాగ్దానాలు చేసినా అమలులో విఫలమవుతున్నాయని ఆరోపించారు. ఎర్రజొన్న, పసుపు రైతులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. పసుపు పండిస్తున్న రైతులకు సరైన ధర లభించక పోవడంతో అన్యాయానికి గురవుతున్నారని వాపోయారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చినా ఇప్పటి వరకు కేంద్రంపై ఒత్తిడి తేలేదని, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయలేదని పేర్కొన్నారు. ఎర్రజొన్న పంటను కొనుగోలు చేస్తామని 2008లో అప్పటి ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని, కానీ ఇప్పటి వరకు దానిని అమలు చేయడం లేదని పేర్కొన్నారు.ఎర్రజొన్నలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా గత సంవత్సరం మద్దతు ధర కల్పించి ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, ఇప్పుడు ఎన్నికలు లేకపోవడంతో రైతులను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వీటిని కొనుగోలు చేయకుండా దళారుల చేతిలో పెట్టాలని చూస్తోందని పేర్కొన్నారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సాంగ్లీ మార్కెట్లో క్వింటా పసుపునకు రూ.8 వేల ధర పలుకుతుంటే మన వద్ద రూ.4 వేల నుంచి రూ. 5 వేల మాత్రమే ధర ఇస్తున్నారని చెప్పారు. ఎర్రజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతులతో కలిసి తాము పోరాటం చేస్తామని తెలిపారు.