ఎర్రవల్లి చౌరస్తాను నూతన మండలంగా ప్రకటించే వరకు ఉద్యమిస్తాం

 

మండల సాధన సమితి, అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం వరకు పాదయాత్ర, ప్రశాంతంగా కొనసాగిన బంద్

ఇటిక్యాల (జనంసాక్షి) జూలై 27 : పాలనా సౌలభ్యం కోసం ఎర్రవల్లి చౌరస్తాను నూతన మండలంగా ప్రకటించేవరకు ఉద్యమం కొనసాగుతుందని ఎర్రవల్లి మండల సాధన సమితి అధ్యక్షులు పి. రాగన్న, ఉపాధ్యక్షులు కృష్ణసాగర్, భీమేశ్వర్ రెడ్డి, అఖిలపక్షం నాయకులు జోగుల రవి, దశరథంసాగర్, ప్రభుదాస్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తా నుండి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వరకు పాదయాత్రగా తరలి వెళ్లారు. అనంతరం వారు మాట్లాడుతూ 44వ జాతీయ రహదారి ఎర్రవల్లి చౌరస్తా పంచాయతీ నూతన మండల ఏర్పాటుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్నాయని, 14 గ్రామాల ప్రజా ప్రతినిధులు ప్రజలు కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. మండల ఏర్పాటుకు అన్ని హంగులు ఉన్నట్లు స్థానిక రెవెన్యూ అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం అబ్రహం, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మంద జగన్నాధం, జిల్లా ఇంచార్జ్ మంత్రులకు మండల సాధన సమితి నాయకుల ఆధ్వర్యంలో పలుమార్లు వినతిపత్రం సమర్పించిన ప్రయోజనం దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నూతనంగా 14 మండలాల ఏర్పాటుకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అందులో ఎర్రవల్లి చౌరస్తా పేరు లేకపోవడం పై వారు మండిపడ్డారు. 14 గ్రామ పంచాయతీలను కలుపుకొని నూతన మండలం ఏర్పాటు చేసుకునేందుకు ఆరు నెలలుగా శ్రమించిన ఎలాంటి హామీ రాకపోవడంతో నిరాశకు గురైనట్లు వారు తెలిపారు. గ్రామాల ప్రజా ప్రతినిధులు, ప్రజలు మమేకమై ఎర్రవల్లి చౌరస్తాను నూతన మండలం ప్రకటన వచ్చేవరకు ఉద్యమం చేస్తూ, ఎర్రవల్లి చౌరస్తాలో రిలే నిరాహార దీక్షలు కొనసాగితాయని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాదయాత్రలో నూతన మండలం ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర అమర కుటుంబాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కావలి మన్యం మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు శ్రీధర్ రెడ్డి, లోకారెడ్డి, పెద్దలక్ష్మన్న, బి. రామన్న, వెంకటన్న, రాజేష్ తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు.