ఎర్ర స్మగ్లర్లకు స్థానికుల సహకారం

దాడులు చేస్తున్నా అడపాదడపా తరలింపు
తిరుపతి,అక్టోబర్‌8  (జనంసాక్షి) : ఎర్రచందనం తరలించడంలో ఎవరికి వారు స్వార్థ చింతనతో సహకరించడం వల్ల విలువైన ఎర్రచందనం తరలిపోతోంది. కోట్లలో లాభాలు పడుతున్న వారికి కొందరు ఉడతాభక్తిగా సహకరిస్తూ పబ్బం గడుపుకోవడంతో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల మళ్లీ దాడులుకు తెగించి అడవులను నరకుతున్నారు. గుట్టుగా కలపను రవాణా చేస్తున్నారు. స్థానిక నేతలు కొందరు స్మగ్లర్లకు సహకరించడం వల్ల కఠిన చర్యలు తీసుకుంటున్నా అడపాదడపా దుంగలు తరలుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్నప్పటికీ వారి కళ్లుగప్పి కలపను తరలిస్తున్నారు. ఎర్రకూలీల తరలింపులో డ్రైవర్ల పాత్రపై విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. దీనిపై ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారు. మరికొందరి పాత్రపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉందన్నారు. తమిళ కూలీలకు సహకరిస్తే కాసులపంట పండిరచుకునే అవకాశం ఉండటంతో డ్రైవర్లు కక్కుర్తిపడినట్లు తెలుస్తోంది. ఒక్కో కూలీని మార్గమధ్యం అటవీ ప్రాంతంలో దించేందుకు ఇంత అని వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఒక్క దఫాలో పదిమందిని తీసుకురావడం ద్వారా నెలకు జీతానికి మించి వచ్చేస్తుండటంతో ఇదే మంచి ఆదాయ వనరుగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. లగేజీల మాటున సంచుల్లో దుంగలేమైనా తరలించారా అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. ఎర్రసొమ్ముకు ఆశపడ్డ కొందరు తమిళ కూలీలకు సహకరిస్తున్నారు. పోలీస్‌ విచారణలో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. గతంలో స్మగర్లర్లు, ఎర్రచందనం నరికే కూలీలు ఎక్కువగా చెన్నైలో ఉండేవారు. ఇటీవల నిఘా వర్గాలు అటు దృష్టి సారించడంతో వారంతా
రూటు మార్చి బెంగళూరును ప్రధాన కేంద్రంగా మార్చుకున్నారు. మరింత నిఘా పెట్టడంతో పాటు స్థానికులను గుర్తిస్తే తప్ప దొంగతనాలు ఆగవని స్థానికులు అంటున్నారు. అడవుల్లో సాయుధులను దింపాలని కూడా అంటున్నారు.