ఎవడబ్బా సొమ్మని విర్రవీగుడు?
‘బయ్యారంలోని ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించి తీరుతాం.. ఏం చేస్తావో చేసుకో’, ‘ఎక్కువ మాట్లాడితే తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనూ.. ఏం చేస్తారో చేసుకోండి’ ఇవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు. అధికార దురహంకారంతో కళ్లు మూసుకుపోయి కిరణ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడంటే తప్పు ఎవరిది. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అంటే 23 జిల్లాల పక్షాన పనిచేయాలా? సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లా పక్షం వహిస్తే సరిపోతుందా? అనేక ప్రశ్నలు గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. 2009 ఎన్నికల్లో ముక్కుతూ.. మూలుగుతూ స్వల్ప ఆధిక్యంతో ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 2011 నవంబర్‌లో సీఎం గద్దెపై కూర్చోబెట్టింది. మొదట్లో ఆయన్ను ముఖ్యమంత్రిగానే గుర్తించని మంత్రివర్గ సహచరులు ఇప్పుడు ఆయన రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నా, మాట్లాడుతున్నా నోరెత్తి ఒక్క మాట మాట్లాడటం లేదు. సీమాంధ్ర ప్రాంతం నుంచి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న వారే ముఖ్యమంత్రికి అప్పుడప్పుడు సమస్యలు సృష్టించారేమో కాని తెలంగాణ మంత్రులు మాత్రం ఆయన ప్రతి చర్యకూ వంత పాడుతూ పుట్టిన గడ్డకు తీరని అన్యాయం, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతినిధులను పౌరులు ఓట్ల ద్వారా ఎన్నుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజల మద్దతుతో అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న పార్టీ అధికారాన్ని చేపడుతుంది. అధికార పార్టీ శాసనసభ పక్షనేత ముఖ్యమంత్రి అవుతాడు. ఆయనకు అనుకూలురు, సన్నిహితులతో మంత్రివర్గం ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగిస్తారు. మంత్రి ప్రమాణ స్వీకారం రాజ్యాంగానికి లోబడే చేస్తాడు. రాగద్వేషాలకు అతీతంగా, భారత సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లకుండా తనకు ఇచ్చిన బాధ్యత నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తాడు. ప్రజల పక్షాన పరిపాలన సాగిస్తాడు. కొన్నాళ్లుగా అధికారం అర్థం మారుతోంది. స్వార్థం, సొంతవారికి ప్రజల సంపద దోచిపెట్టడం, ఆశ్రిత పక్షపాతమే అధికారమయ్యాయి. ప్రజలకు చిన్నపాటి తాయిళాలు విసిరి ఓట్లు దండుకోవడం ఇప్పుడో ట్రెండ్. ఓట్లేసినోళ్లకు తాటాకు ఇచ్చి గద్దెనెక్కినోళ్లు ఈతాకులే కాదు ఏకంగా చెట్లే దోచుకెళ్తున్నారు. ప్రతిపక్షానికి కూడా కాలక్రమంలో అర్థం మారుతోంది. ప్రజల పక్షాన నిలిచి పరిపాలన సవ్యంగా సాగేందుకు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నేతలు అధికారంతో అంటకాగుతున్నారు. కాంట్రాక్టులు, పైరవీలే పరమావధిగా పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు తెచ్చిన విపరిణామమే కిరణ్‌కుమార్‌రెడ్డిలాంటి సీఎంల లెక్కలేనితనం. ఏ ముఖ్యమంత్రి ఇంతకుముందు ఇంత దారుణంగా మాట్లాడలేదు. రాష్ట్రంలోని పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రాంతాన్ని దోచుకోవడం, సవతి తల్లిలా కొద్దిపాటి నిధులతో కాలం వెళ్లదీయడమో చేశారు తప్ప అసలే నిధులు ఇవ్వబోమని తెగేసి చెప్పలేదు. చేసింది గోరంతే అయినా కొండంత చేసినట్టు చెప్పుకున్నారు కూడా. కానీ కిరణ్ అన్నిటికీ అతీతుడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగమైన తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వమని నిండు శాసనసభలో నిస్సిగ్గుగా అన్నాడు. సీఎం అంతలేసి మాటలంటున్నా ఆయన మంత్రివర్గంలో, ఆయన చేసే పాపాల్లో భాగస్వాములుగా ఉన్న ఒక్క తెలంగాణ మంత్రి నోరు విప్పి ఇదేమిటని ప్రశ్నించలేదు. ఒక్క ఎమ్మెల్యే నిల్చుని సీఎం వ్యాఖ్యలపై నిరసన తెలపలేదు. ఆ రోజు సభలో టీఆర్‌ఎస్‌ను, ముఖ్యంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసినట్టు సీఎం ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా ఆయనలోపల దాచుకున్న కాలకూట విషం బద్ధలైందనే మాట వాస్తవం. ఎవడబ్బ సొమ్మని బడ్జెట్‌లో తెలంగాణకు నిధులివ్వబోమని ముఖ్యమంత్రి అంటాడు. బడ్జెట్ అంటే ఆయన ఇంటి గళ్లాపెట్టెనా? ఆయన తాతతండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తా? ప్రజలిచ్చిన అధికారంతో రాజభోగాలు అనుభవిస్తూ వారికేమీ ఇవ్వబోమని అనే ధైర్యం ఆయనకు ఎవరిచ్చారు? ఆయన అంతలా బరితెగించి మాట్లాడుతుంటే మంత్రులు ఏం చేస్తున్నారు? సీఎం తెలంగాణపై విషం కక్కడం అప్పటితో ఆపలేదు. తెలంగాణ ప్రజలకు మరీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని బయ్యారం, వరంగల్ జిల్లాలోని గూడూరు, కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లి ప్రాంత ప్రజలకు దక్కాల్సిన ఇనుప ఖనిజాన్ని ఇష్టారాజ్యంగా తరలిస్తామని తెలంగాణ నడిగడ్డపై ప్రకటించాడు. అసలు నీవు ఏం చేసుకుంటావో చేసుకోమంటూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కేసీఆర్ ఆయన స్వార్థం కోసం బయ్యారం గనుల గురించి మాట్లాడలేదు. తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన వనరుల దోపిడీపై నిలదీశారు. ఇక్కడే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పాడు. ప్రభుత్వం దిగి వచ్చి బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మించే వరకూ ఉద్యమిస్తామని చెప్పాడు. అవసరమైతే భూకంపం సృష్టించైనా ఇనుప ఖనిజం తరలింపును అడ్డుకొని తీరుతామని హెచ్చరించాడు. సీఎం సీమాంధ్ర పక్షపాతి కాకుంటే కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్‌కు అప్పగించిన భూములను ఎందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేటాయించలేదు. అనంతరపురం జిల్లాలోని ఇనుప ఖనిజాన్ని ఎందుకు అప్పగించలేదు. కేవలం తెలంగాణలోని ఖనిజాన్ని మాత్రమే తరలిస్తామనడంలో మతలబు ఏంటి? ఆరు దశాబ్దాలుగా సాగిస్తున్నా తెలంగాణ ప్రాంత వనరుల దోపిడీకి కొనసాగించడమేనా? అదే నిజమని ప్రతి తెలంగాణ పౌరుడూ అంటున్నాడు. అందుకు వంత పాడుతున్న మంత్రులను, ఎమ్మెల్యేలను చరిత్ర హీనులుగా ప్రకటిస్తున్నారు. ఇల్లు అలకగానే పండగకాదు. కుర్చీలో ఉన్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోబోరు. ప్రజలు అంతా గమనిస్తున్నారు. వాళ్లు కీలెరిగి వాత పెట్టే సమయం దగ్గరపడుతోంది. ఆ రోజు సీఎ విర్రవీగుడుకు సమాధానం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని 294 సీట్లలో 119 మంది ఎమ్మెల్యేలు తెలంగాణలోని పది జిల్లాల నుంచే ఉన్నారు. రేపు ఆ స్థానాల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరగడం ఖాయం.