ఎవరన్నారు ? టీఆర్‌ఎస్‌ విలీనమవుతున్నదని

అది ఊహాజనిత వార్త
బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్చిని ఖండించిన ఈటెల
లాఠీ చార్చిని ఖండించిన ఈటెల
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి): కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనమవుతుందని వస్తున్నవార్తల్లో ఎలాంటి నిజం లేదని. అవన్నీ ఊహాజనితమేనని టీఆర్‌ఎస్‌ ఎల్పీనేత ఈటెల రాజేందర్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాజకీయ జెఎసి పిలుపు ఇచ్చిన మార్చ్‌లో పాల్గొనే విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాలని హైకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమన్నారు. అదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, తమ పార్టీ బృందం పర్యటించి ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తుందన్నారు. తెలంగాణ ప్రాంతంపై వివక్ష కొనసాగుతూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో పెట్టుకుంటే ఖబడ్దార్‌ అని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతి విషయలో ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. ఆదిలాబాద్‌ జిల్లా రైతులు గత రెండు నెలలుగా ఎరువుల కోసం పాట్లు పడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఈటెల విమర్శించారు. అసలు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేక సీమాంధ్రకు ముఖ్యమంత్రా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణకు సరియైన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సకాలంలో ఎరువులను పంపిణీ చేయలేకపోయారని విమర్శించారు. యూరియాకు డిమాండ్‌ తగ్గినా సరఫరాచేయలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. తెలంగాణ రైతుల కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రత్యేక తెలంగాణకోసం ఉద్యమిస్తున్న బిజెపి కార్యకర్తలపై ఢిల్లీ పోలీసుల దాడిని ఖండిస్తున్నామని టీర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ తెలిపారు. తెలంగాణ కోసం పోరాడుతున్న వారిపై లాఠీచార్జి చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. డిసెంబర్‌ 9ప్రకటన అమలు చేయకపోవగా, బిజెపి కార్యకర్తలపై దాడి చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. దాడికి సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌లే బాధ్యత వహించాలని డిమాండ్‌చేశారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈటెల హర్షం వ్యక్తంచేశారు.