ఎస్సీ వర్గీకరణకు మద్దతు చేసే పార్టీలకు గుణపాఠం తప్పదు.

మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి పాత్కుల శ్రీశైలం.

అచ్చంపేట ఆర్సీ, 27 జూలై( జనం సాక్షి న్యూస్ ) : ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికే పార్టీలకు గుణపాఠం తప్పదని మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి పాత్కుల శ్రీశైలం అన్నారు. స్థానిక పట్టణ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన దిశ నిర్దేశాన్ని అనుసరించకుండా స్వార్థం కోసం షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కు కొందరు వత్తాసు పలుకుతూ మాల మాదిగల పట్ల ఆంతర్యం సృష్టిస్తూనే ఉన్నారని విమర్శించారు. గతంలో ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా వెలువడినప్పటికీ ఆయా పార్టీలు తమ ఓటు బ్యాంకు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ మద్దతు ఇస్తామని మొసలి కన్నీరు కారుస్తున్నాయని అలాంటి పార్టీలకు మాల సామాజిక వర్గం త్వరలోనే తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎస్సీల రిజర్వేషన్ శాతం పెంచేలా మూకుమ్మడిగా ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కొందరు పార్టీల ప్రలోభాలకు గురై వర్గీకరణ విషయం పట్ల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఇది న్యాయబద్ధం కాదన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అందరం గౌరవించాలని ఆయన సూచించారు. సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనంద్, జిల్లా నాయకులు చెన్నకేశవులు, రాష్ట్ర నాయకులు అనిల్, శ్యామ్, సుదర్శన్, ఆదినారాయణ జయపాల్, రవికుమార్, కిన్నెర పాండు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.