ఎస్‌బీహెచ్‌ విలీనం వద్దు

2
హైదరాబాద్‌,ఆగస్టు 17(జనంసాక్షి): స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(ఎస్‌బీహెచ్‌) విలీనాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘ఎస్‌బీహెచ్‌ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. ఇది తెలంగాణ బ్యాంకు. అలాగే కొనసాగుతోంది’ అని అన్నారు. 1956కు ముందు కూడా నిజాం పాలనలో బ్యాంకు కార్యకలాపాలు జరిగాయని, అప్పట్లో హైదరాబాద్‌ రాష్ట్రానికి  చెందినదిగా ఉండేదని వివరించారు. ఎస్‌బీఐలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌ విలీనం చేయడంపై కేరళ శాసనసభ అందుకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీహెచ్‌ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడి శాసనసభలో ఏమైనా తీర్మానం చేస్తారా? అన్న ప్రశ్నకు ఈటల సమాధానమిస్తూ.. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏదీ లేదన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో చర్చిస్తామని ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఈటల స్పష్టం చేశారు. ఎస్‌బీహెచ్‌, ఎస్‌బీటీ సహా ఐదు బ్యాంకులను ఎస్‌బీఐలో విలీనం చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.