ఏం సాధించారని వేడుకలు చేస్తున్నారు

– ఆవిర్భావం పేరుతో వృథా ఖర్చులు చేస్తున్నారు
– చిత్తశుద్ది ఉంటే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయండి
– ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌ బీజేపీకే మద్దతిస్తున్నాడు
– సీపీఐ జాతీయ నాయకులు నారాయణ
న్యూఢిల్లీ, జూన్‌2(జ‌నం సాక్షి) : ఏం సాధించారని ఆవర్భావ వేడుకలు నిర్వహించుకుంటున్నారని  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల పేరుతో వృథా ఖర్చులు చేస్తున్నారని ఆరోపించారు. అసలు ఏం సాధించారని ఉత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలే అమలు చేయలేదన్నారు. అలాంటప్పుడు వేడుకలు ఎలా చేస్తారని నిలదీశారు. రైతుబంధు పథకంతో పేదరైతులకు పెద్దగా ప్రయోజనం లేదని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని, వాటిపై దృష్టిసారించకుండా నాలుగేళ్లు అమలు కాని హావిూలతో కేసీఆర్‌ పబ్భం గడుపుకున్నాడని విమర్శించారు. నాలుగేళ్లలో ప్రజలకు ప్రయోజనకరమైన ఏం పనులు చేశారో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధుతో హడావిడి చేస్తున్న కేసీఆర్‌.. ఆ పథకం పేరుతో ధనిక రైతులకు ప్రభుత్వ ఖజానాను దోచి పెడుతున్నారన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌ నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రంట్‌ పేరుతో బీజేపీకే మద్దతిస్తున్నారని తెలిపారు. వేరే పక్షాలను చీలిస్తే బీజేపీకే ప్రయోజనం చేకూరుతుందని నారాయణ చెప్పుకొచ్చారు.