ఏం సాధించారని సంబురాలు?

3

– మోదీపాలనపై మండిపడ్డ కాంగ్రెస్‌

హైదరాబాద్‌,మే26(జనంసాక్షి): నరేంద్రమోదీ ప్రధానిగా సాగిన రెండేళ్ల పాలనపై ఎపి కాంగ్రెస్‌ పెదవి విరిచింది. ఆర్బాటాలు తప్ప ప్రజలకు ఒరిగిందేవిూ లేదని వ్యాఖ్యానించింది. దేశంలోని మౌలిక రంగాల్లో వృద్ధిని సాధించడంలో విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు విమర్శించారు. వ్యవసాయం, పారిశ్రామికవృద్ధి, స్థూల జాతీయోత్పత్తి, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు, దిగుమతులు తదితర రంగాల్లో గణాంకాలను పరిశీలిస్తే యూపీఏ పాలనలోని వృద్ధి కన్నా తక్కువ వృద్ధి కనబరుస్తున్నాయని కనుక మోదీ పాలన తీవ్రంగా వైఫల్యం చెందిందన్నారు. నరేంద్ర మోదీ ప్రచార ఆర్భాటాలతో వాస్తవాలను ప్రజలకు చేరనీయకుండా మాటల గారడీ చేస్తున్నారని, ఏ రంగంలో చూసినా మోదీ పాలనలో ప్రజలకు జరిగిన ప్రయోజనం ఏవిూ లేదన్నారు. గురువారం ఇందిరాభవన్లో పీసీసీ నాయకులు, డా.శైలజానాథ్‌ సూర్యానాయక్‌, జంగా గౌతమ్‌, సుందర రామశర్మ, శాంతి భూషణ్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో పళ్లంరాజు మాట్లాడారు. ఏపీకి సాయం చేయడంలో మోదీ రెండేళ్ల సాలన తీవ్ర నిరాశకు గురిచేసిందని, నిరాశ అనేదానికన్నా అన్యాయం, ద్రోహం చేసిందని చెప్పడం సబబుగా ఉంటుందని ఇంత అన్యాయాన్ని సీఎం చంద్రబాబు ఎలా భరిస్తున్నాడో అర్థం కావడం లేదని పళ్లంరాజు చెప్పారు. జాతీయ అంశాలపై విశ్లేషిస్తూ మోదీ రెండేళ్ల పాలన విదేశాంగ వ్యవహారాల్లో, సరిహద్దు దేశాలలో సఖ్యత నెరపడంలో పూర్తిగా విఫలమైందన్నారు. దేశంలో కరువును ఎదుర్కోవడంలో, రైతులకు అండగా నిలవడంలో, యువతకు ఉపాధి కల్పించడంలో, మోదీ రెండేళ్ల పాలన విఫలమయిందని పళ్లంరాజు గణాంకాలతో వివరించారు. అధికారంలోకి వస్తే అచ్చే దిన్‌ తెస్తామన్న మోడీ, రెండేళ్ల పాలనలో ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు చేసి జనాన్ని మోసం చేశారని ఆరోపించింది. రెండేళ్లలో దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజార్చడం, సామాజిక అభద్రత, మైనార్టీల్లో భయం కలిగించే ప్రయత్నం తప్ప ఇంకేవిూ చేయలేదని విమర్శించింది. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పారిశ్రామిక రంగం కుదేలవడం, నిరుద్యోగుల సంఖ్య పెరగడం, బ్యాంకింగ్‌ వ్యవస్థ కుప్పకూలడం మినహా దేశానికి ఒనగూరిన ప్రయోజనమేవిూ లేదని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. అధికారంలోకి వస్తే 100రోజుల్లో బ్లాక్‌ మనీ వెనక్కి తెప్పించి ఒక్కో కుటుంబానికి 15 లక్షల రూపాయలు పంచుతామన్న బీజేపీ.. ఇప్పుడు అది కేవలం ఎన్నికల జిమ్మిక్కు మాత్రమే అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. మేకిన్‌ ఇండియా, స్మార్ట్‌ సిటీల గురించి గొప్పగా ప్రకటించుకోవడం మినహా కేంద్రం చేసిందేవిూ లేదన్నారు. రెండేళ్లలో మహిళలపై దాడులు, అవినీతి మరింత పెరిగిపోయిందన్న ఖర్గే, మోడీ సర్కారు అమలు చేస్తున్న విదేశాంగ విధానం పాకిస్థాన్‌, చైనా కన్నా అధ్వానంగా ఉందని విమర్శించారు.మోడీ రెండేళ్ల పాలనపై కేవలం విపక్షాలే కాక బీజేపీ మిత్రపక్షమైన శివసేన కూడా తనదైన శైలిలో విరుచుకుపడింది. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలను టార్గెట్‌ చేసిన సేన ఆయన భారతీయుడా లేక ఎన్నారైయా అనే సందేహం కలుగుతోందని ఎద్దేవా చేసింది. మోడీ అధికారంలోకి వచ్చాక పలు పథకాలు ప్రకటించినా అవేవీ సామాన్యులకు చేరలేదని, బ్లాక్‌ మనీ వెనక్కి తెప్పించేందుకు మోడీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది.