ఏకపక్ష నిర్ణయం తగదు..
సస్పెన్షన్ ఎత్తివేయండి.. వేటుపై బదులివ్వండి
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని
విజయవాడ, జూలై 11 : తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనపై ఎందుకు సస్పెన్షన్ వేటు వేసిందో చెప్పాలని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని డిమాండు చేశారు. బుధవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ పరామర్శించేందుకే వైఎస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను కలిశానని, ఆమెతో కేవలం 10 నిమిషాల పాటు మాత్రమే భేటీ అయ్యానని, ఇంతలోనే పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినట్టు వార్తలొచ్చాయని చెప్పారు. ఆ వార్తలకు తాను నిర్ఘాంతపోయానన్నారు. ఆ తర్వాత జగన్‌ను కలిశానన్నారు. ఎవర్ని కలవాలో.. ఎవర్ని కలవకూడదు అన్నది తన వ్యక్తిగతమని చెప్పారు. తానెవరినైనా కలుస్తానని, ఆ హక్కు తనకు ఉన్నదని చెప్పారు. పోనీ కాంగ్రెస్ వారితో కలవవచ్చామో చెప్పాలన్నారు. తనను మెడ పట్టి పార్టీ నుంచి బయటకు గెంటివేయడమే కాకుండా ఏవేవో కుంటిసాకులు చెబుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ తనకు కన్నతల్లి వంటిదని, ఆ పార్టీని వీడబోనని చెప్పారు. అయితే తననెందుకు సస్పెండ్ చేశారో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పాలన్నారు. లోకేష్‌ను పార్టీలోకి తెచ్చేందుకే చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని అయినందుకే తనపై వేటు వేశారన్నారు. గుడివాడ ప్రజలు తనపై ఎందుకు తిరగబడతారో చెప్పాలన్నారు. ఎన్టీఆర్‌పై అభిమానంతో పార్టీలోకి చేరానని, ఆయనపై అభిమానంతోనే పనిచేశానని చెప్పారు. సంవత్సరన్నర క్రితం మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమకు తనకు మధ్యకు వాగ్వాదం జరిగితే ఆ విషయంపై నేటికీ తనను పిలిచి విషయమేమిటని అడగలేదన్నారు. తాను వెన్నుపోటుదారుడ్ని కాదన్నారు. తన సంజాయిషీ కోరకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబే పెద్ద కుట్రదారుడు అని ఆరోపించారు. చంద్రబాబే తనకు క్షమాపణ చెప్పాలని కోరారు. తన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. తాను వ్యక్తిగతంగా ఎవరినైనా కలిసే హక్కు తనకు ఉన్నదని, ఆ హక్కు ప్రకారమే వారిని కలిశాను తప్పితే మరో విషయమేదీ లేదన్నారు. ఇప్పటికైనా తనను ఎందుకు గెంటివేశారో చెప్పాలని డిమాండు చేశారు. రానున్న రోజుల్లో అన్ని వర్గాలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటానని చెప్పారు. జగన్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. తన కుమార్తెలపై ప్రమాణం చేసి చెబుతున్నానన్నారు. తనది డబ్బుకు కక్కుర్తిపడే నైజం కాదన్నారు. ఆ నైజం ఉన్నట్టయితే వైఎస్‌ఆర్ సిఎంగా ఉన్నప్పుడే వెళ్లిపోయేవాడినని చెప్పారు.