ఏకీకృతపన్ను విధానం గొప్పముందడుగు
– అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ,ఆగస్టు 4(జనంసాక్షి):దేశంలో ఒకే పన్ను విధానాన్ని అమలుచేసే దిశగా ఓ గొప్ప ముందడుగు పడిందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్లుకు ఒక్క పార్టీ తప్ప అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని అన్నారు. చారిత్రక బిల్లుకు మార్గాన్ని సుగమం చేస్తూ రాజ్యాంగ సవరణకు రాజ్యసభ ఆమోదం తెలిపిన సందర్భంగా గురువారం ఆయన విూడియాతో మాట్లాడారు. గతంలో వివిధ రాజకీయ కారణాల వల్ల జీఎస్‌టీ బిల్లు పెండింగ్‌లో ఉండాల్సి వచ్చిందన్నారు. ఒకే దేశం.. ఒకే పన్ను విధానం ఉండాలనేదే మా ఉద్దేశం అని వెల్లడించారు. జీఎస్‌టీ బిల్లు వల్ల దేశంలో వాణిజ్యం మరింత సులభతరం అవుందన్నారు. అన్ని రాష్టాల్ర ముఖ్యమంత్రులు, ఆర్థికమంత్రులు సహా ఎంపిక కమిటీతో సంప్రదింపులు జరిపామని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణపై రాజ్యసభలో ఏకాభిప్రాయం సాధించలేక చాలా ఏళ్లుగా బిల్లు పెండింగ్‌లో ఉండిపోయిందని తెలిపారు. మొత్తానికి ఇన్నాళ్లకు అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఏకగ్రీవంగా రాజ్యాంగ సవరణను ఆమోదించాయని వెల్లడించారు. ఇందులో రాష్ట్రాలు ముఖ్యపాత్ర పోషించాయని, ఉత్పత్తి ఎక్కువగా ఉండే రాష్ట్రాలు కూడా జీఎస్టీతో తమకు లాభమని నమ్మాయని జైట్లీ తెలిపారు. రాష్ట్రాలు మద్దతు తెలపడంతో ఎంపీలు కూడా దీనికి అడ్డుచెప్పలేకపోయారని అన్నారు. జీఎస్టీ బిల్లులో ప్రాథమికాంశాలకు విఘాతం కలగకుండా వివిధ పార్టీలు చెప్పిన సవరణలు చేశామని వెల్లడించారు. జీఎస్టీ అమల్లోకి వస్తే వ్యాపారం సులభతరం అవుతుందని, ఇటు వ్యాపారస్థులు, అటు సాధారణ పౌరులు కూడా లబ్ధి పొందుతారని చెప్పారు. ఈ బిల్లులో రాజ్యసభ అదనంగా చెప్పిన సవరణలకు ఇప్పుడు లోక్‌సభ కూడా ఆమోదం తెలుపాల్సి ఉందని జైట్లీ తెలిపారు. 2017లోపే జీఎస్టీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని, దీనిని అమలు చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.