ఏకీ రాస్తాజయశంకర్‌ మాటే తెలంగాణ బాట

వరంగల్‌/ఏటూరునాగారం, మార్చి 31 (జనంసాక్షి) :
ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ మాటే తెలంగాణ బాట అని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఏటూరునాగారంలో ఏర్పాటు చేసిన జయశంకర్‌, తెలంగాణ తల్లి విగ్రహాలను ఆయన ఆవిష్కరించి, అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ కోసం పోరు ఆపబోమని స్పష్టం చేశారు. నాలుగున్నర కోట్ల మంది ఆకాంక్ష కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తామని అన్నారు. త్వరలోనే జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించి విజయవాడ సడక్‌బంద్‌, అసెంబ్లీ ముట్టడి, హైదరాబాద్‌ దిగ్బంధంపై చర్చిస్తామని అన్నారు. జేఏసీ పక్షాన తెలంగాణ కోసం నిర్వహించిన సడక్‌బంద్‌ చారిత్రాకమైందని, సీమాంధ్ర పెట్టుబడిదారి శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చెక్కుచెదరని గుండెధైర్యంతో ముందుకుసాగుతామని తెలిపారు. తెలంగాణ కోసం ఎవరూ ప్రాణత్యాగాలు చేయవద్దన్నారు. జయశంకర్‌ సీమాంధ్ర పాలకుల కుట్రలు, కుతంత్రాలను ఎప్పటికప్పుడు ఎలుగెత్తిచాటుతూ తెలంగాణ ప్రజల్లో ఉద్యమ కాంక్ష చెదరకుండా నిలిపారన్నారు. ఆయన  చూపిన మార్గంలోనే తాము ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తామన్నారు. ప్రజల ఆకాంక్షల సాధన కోసం సాగుతున్న పోరాటంలో అన్ని వర్గాలు ప్రజలు భాగస్వాములైన సీమాంధ్ర మీడియా కట్టుకథలు ప్రసారం చేస్తూ, ప్రచురిస్తూ విషభీజాలు నాటాలని ప్రయత్నిస్తోందని, దానిని ఎవరూ పట్టించుకోరని అన్నారు.