ఏడారి దేశంలో రెక్కలు విరిగిన పక్షి

2

– సర్కారు సాయంకోసం సాజీద్‌ ఎదురుచూపు

(టి.రమేశ్‌ బాబు)

పాతికేళ్ల కుర్రాడైనా పరుగెత్తలేడు, పదిమందిలో ఒకడిగా ఉండలేడు. ఉత్సాహం ఉరకలెత్తే వయసే అయినా మంచం విూద నుంచి దిగలేడు. గొంతు పెగల్చి మాట్లాడడమే తప్ప కాళ్లూ, చేతులు కదల్చలేని దయనీయ స్థితి సాజీద్‌ పాషాది. పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం పరాయిదేశం వెళ్లిన సాజీద్‌ జీవితంలో పెనువిషాదమే మిగిలింది. కరీంనగర్‌ జిల్లా మేడిపల్లి మండలం కల్వకోట గ్రామానికి చెందిన సాజీద్‌ పాషా బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశం వెళ్లాడు. ఆయన దుబాయి వెళ్లాకే ఇంట్లో అమ్మా, నాన్న, ఇతర కుటుంబ సభ్యులు నాలుగు మెతుకులు తినగలుగుతున్నారు. ఊళ్లో మిగతావారి ముందు తలెత్తుకుని గౌరవంగా బతకగలుగుతున్నారు. అయితే అన్నీ బాగుంటే అది జీవితం ఎలా అవుతుంది? సాజీద్‌ జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఆ యువకుణ్ని అవిటివాణ్ని చేసింది. తోటివారికి చేతనైన సాయం చేసే చేతులే ఇప్పుడు మరొకరి సాయాన్ని అర్థిస్తున్నాయి.

ఏం జరిగింది?

సాజీద్‌ జీవితంలో విషాదపు ఘడియలు మొదలై ఏడాదవుతోంది. పోయిన సంవత్సరం ఇదే రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న సమయంలోనే మూడంతస్తుల భవనం విూది నుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. దుబాయిలో ఉన్న సాజీద్‌ 18 జూన్‌, 2015న రాత్రి మేల్కొని అదే నిద్ర మత్తులోనే కిటికీ తలుపులు తెరిచాడు. దాన్నే ప్రధాన ద్వారంగా భ్రమించిన సాజీద్‌ కిటికీ బయట అడుగుపెట్టడంతో అమాంతం మూడు అంతస్తుల భవంతి నుంచి పడిపోయాడు. సాజీద్‌ కు అప్పుడప్పుడూ నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందని, అది ఇంతటి విషాదానికి దారి తీస్తుందని తాము అనుకోలేదని ఆయన మిత్రులు చెబుతారు. ఈ ఘటనతో సాజీద్‌ తీవ్రగాయాల పాలయ్యాడు. అయితే కాళ్లూ, చేతులూ విరిగినా కోలుకునే అవకాశం ఉండేది. కానీ విరిగింది సాజీద్‌ వెన్నెముక. దీంతో నడుం నుంచి కింది భాగమంతా చచ్చుబడిపోయింది. సగం శరీరం జీవచ్ఛవంలా మారిపోయింది.

ఏడాదిగా మంచానికే పరిమితం

ప్రమాదంలో బాదితుడి వెన్నముక విరగడం వల్ల పాపం పాషా రెండు కాళ్లూ చలనం లేకుండా పోయాయి. నడుం కింది భాగం నుంచి  స్పర్శ పూర్తిగా కోల్పోవడం జరిగింది. ప్రతి నెలా ఆస్పత్రికి వెళ్లాల్సిందే. పెద్దమొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సిందే. గాయాల తీవ్రత వల్ల అప్పుడప్పుడూ శరీరంపై విపరీతమైన మంటలు, భరించలేని నొప్పితో నేటికీ సాజీద్‌ అవస్థలు పడుతుంటాడు. మంచం విూద లేచి కూర్చోవాలన్నా తాడు సహాయం లేనిదే కూర్చోలేడు. పేదరికం కారణంగా దుబాయి వెళ్లి క్రమశిక్షణ తప్పకుండా విధులు నిర్వర్తిస్తూ, ప్రతి నెలా తల్లిదండ్రులకు డబ్బులు పంపుతూ  కన్నవారికి అండగా నిలిచి సంతోషాన్ని నింపే సమయంలోనే పాషా కుటుంబం కష్టాల కడలిలో కూరుకుపోయింది.

సాజీద్‌ కుటుంబానికి మిత్రుల చేయూత

సాజీద్‌ పాషా దుబాయిలో ఉన్నప్పుడే అందరితోనూ కలుపుగోలుగా ఉండేవాడని మిత్రబృందం గుర్తు చేసుకుంటోంది. ఎమిరేట్స్‌ తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ లో చురుగ్గా ఉండేవాడు. ఆ ఆప్యాయతతోనే ఈటీసీఏ కూడా సాజీద్‌ కుటుంబం పట్ల ఆదరభావంతో మెలగుతోంది. చలనం లేని సాజీద్‌ ను మిత్రులంతా సొంత ఖర్చులతో ఇండియాకు చేర్చి, ఆస్పత్రుల ఖర్చులు కూడా చాలావరకు భరించారు. కుటుంబానికి అడపాదడపా సాయం చేస్తున్నారు. అయితే ఇక జీవితంలో నడవలేని సాజీద్‌ ను, ఒకరి ఆసరా లేకుండా కదల్లేని సాజీద్‌ ను ఎవరు మాత్రం ఎంతకాలం భరిస్తారు? అందుకే పేదలపట్ల సానుభూతితో ఉన్న తెలంగాణ సర్కారే సాజీద్‌ కుటుంబం విూద కనికరం చూపాలని ఈటీసీఏ ప్రతినిధులు వేడుకొంటున్నారు. ఇప్పటికే సాజీద్‌ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి నివేదికను ఎన్నారై మినిస్టర్‌ కేటీఆర్‌ కు అందించారు. ఆ తరువాత పరిణామాలతో సాజీద్‌ కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వయసు విూరిన తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకొని సర్కారు తరఫున సాయం ప్రకటించాలని ఈటీసీఏ ప్రతినిధి గాంధారి సత్యనారాయణ, పీచర కిరణ్‌ కుమార్‌ తదితరులు విజ్ఞప్తి చేస్తున్నారు. వయసు విూరిన తల్లిదండ్రులు తమ పాతికేళ్ల కొడుకును పసిపాపలా చూసుకోవాల్సిన పరిస్థితులను సానుకూలంగా పరిశీలించాలని కోరుతున్నారు. ఈ రంజాన్‌ ముగిసేలోగానే సాజీద్‌ కుటుంబానికి సర్కారు తరఫున ఆదుకుంటూ హావిూ ఇవ్వాలని ఈటీసీఏ విజ్ఞప్తి చేస్తోంది. ఎప్పుడూ లేనిరీతిలో సర్కారు తరఫునే రంజాన్‌ ఉత్సవాలు నిర్వహిస్తున్న తెలంగాణ సర్కారు.. ఉపవాస దీక్షలో ఉన్నప్పుడే విషాదానికి గురైన సాజీద్‌ కుటుంబ పరిస్థితిని సానుకూలంగా పరిశీలిస్తుందని తెలంగాణ ప్రజానీకం ఆశిస్తోంది.