ఏడుగురు పోలీసుల మృతదేహాలు ఇంకా అడవిలోనే

రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు పోలీసుల మృతదేహాలు ఇంకా అడవిలోనే ఉన్నాయని, ఇది దేశానికే సిగ్గు చేటని కాంగ్రెస్ పార్టీ బీజేపీని తీవ్రంగా విమర్శించింది. వీర మరణం పొందినవారికి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా రమణ్సింగ్ ప్రభుత్వం అవమానపరిచిందని తప్పుబట్టింది. శనివారం మావోయిస్టులకు పోలీసులకు మధ్య రెండు గంటల పాటు జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు పోలీసులు చనిపోగా.. 12 మంది గాయాలపాలయ్యారు. గత ఆరు నెలల్లో మావోయిస్టులకు సంబంధించి పెద్ద ఘటన కూడా ఇదే .2013లో సాల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ సహా కాంగ్రెస్ నాయకులు, జవాన్లను హతమార్చిన మావోయిస్టులు.. పోలీసులను పెద్ద ఎత్తున చుట్టుముట్టడం ఈ ఏడాదిలో ఇదే ప్రథమం. ఈ విషయంపై కాంగ్రెస్ నేత ఆర్పీఎన్ సింగ్ మాట్లాడుతూ ‘ఛత్తీసగఢ్లోని బీజేపీ ప్రభుత్వం అమరులైన పోలీసులకు కనీస గౌరవాన్ని కూడా ఇవ్వడం లేదు. చనిపోయిన వారి మృతదేహాలు ఇంకా అడవిలోనే ఉండటం సిగ్గు చేటు’ అని అన్నారు. అయితే, ఆదివారం మధ్యాహ్నం సమయంలో వారి మృతదేహాలు తరలించారు.