ఏడు గంటల కరెంటు ఇవ్వండి తెలంగాణ రైతుల్ని ఆదుకోండి

సీఎం చాంబర్‌ ముందు తెరాస ఎమ్మెల్యేల ఆందోళన.. అరెస్టు
పొన్నాల హామీతో దీక్ష విరమించిన టీఆర్‌ఎమ్మెల్యేలు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20(ఆర్‌ఎన్‌ఎ): శాసనమండలిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముఖ్యమంత్రి ఇస్తున్న హావిూలు, చెబుతున్న మాటలకు విలువ లేకుండా పోయిందని ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులకు ఏడు గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనేకసార్లు బహిరంగసభల్లో రైతులకు హావిూలు ఇచ్చారని ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. సీఎం మాటలు విని రైతులు నిండా మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హావిూలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం కిరణ్‌ వారిని ఛాంబర్‌లోకి పిలిపించుకొని మాట్లాడారు. రైతులకు సరఫరా చేసే విద్యుత్‌పై వెనకడుగు వేసేది లేదని చెప్పారు. విద్యుత్‌ కొరత దృష్ట్యా 2,3 విడతల వారీగా రైతులకు ఏడు గంటల కరెంట్‌ను కొనసాగిస్తున్నామని సీఎం చెప్పారు. సీఎం వివరణకు సంతృప్తి చెందని సభ్యులు ఛాంబర్‌ ముందు ఆందోళనకు దిగారు. సీఎం కార్యాలయం ముందు బైఠాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు శాసనసభ సమావేశాన్ని నిర్వహించకుండా వాయిదా వేయడం పట్ల తెలుగుదేశం, వామపక్షాలు ఆందోళనకు దిగాయి. సభ వాయిదా వేయడాన్ని నిరసిస్తూ ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలు రవీంధ్ర భారతి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ కూడా ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీ రెండో గేటు వద్ద ఆందోళనకు దిగింది. ప్రజాసమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. వ్యవసాయానికి ఏడు గంటలపాటు విద్యుత్‌ సరఫరాను చేయడంలో రాజీ లేదని వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ ఖచ్ఛితంగా విద్యుత్‌ను రెండు విడతలుగా 7 గంటలపాటు సరఫరా చేస్తామని దీనిపై అధికారులతో సమీక్షిస్తామని ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన గురువారం సాయంత్రం వారితో చర్చించారు. మంత్రి హామీ మేరకు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దీక్ష విరమించారు.
ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ ఆవేదనను అర్థం చేసుకుందని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. రైతులకు ఏడు గంటలు విద్యుత్‌ అందించాలనే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాలో ప్రాధాన్యం ఇచ్చి పంటలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన టిఆర్‌ఎస్‌ ఎమ్మేల్యేలకు తెలిపారు. టిఆర్‌ఎస్‌ శాసనసభ్యులు ప్రజల పక్షాన నిలబడి తమ నిబద్ధతను చాటుకున్నారనే విషయాన్ని తాము గుర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉందని, వర్షాలు లేకపోవడంతో జలాశయాలు నిండలేదని, దాంతో జలవిద్యుదుత్పత్తి విపరీతంగా తగ్గిపోయిందని ఆయన చెప్పారు. గ్యాస్‌ సరఫరా తగ్గిపోవడంతో గ్యాస్‌ ఆధారిత విద్యుదుత్పత్తి కూడా తగ్గిపోయిందని ఆయన అన్నారు. దీంతో విద్యుత్తు సమస్య ఎదురవుతోందని ఆయన అన్నారు. ఈ సమస్యను జాతీయ విపత్తుగా పరిగణించాలని ఆయన చెప్పారు. రైతులకు విద్యుత్‌ను అందించడంలో రాజీపడ బోమని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన తెలిపారు. వినియోగదారులకు మేలు చేయాలనడంలో రెండో మాట లేదని, అందులోనూ వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు. వ్యవసాయానికి అందిస్తున్న విద్యుత్తుపై ప్రతిరోజూ సమీక్ష జరిపి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన చెప్పారు విద్యుత్తు సమస్య ఈ సారి ప్రకృతి వైపరీత్యంలా వచ్చిందని, మునుపెన్నడూ ఈ విధమైన సమస్య రాలేదని ఆయన అన్నారు. పొన్నాల లక్ష్మయ్య హామీతో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ధర్నా విరమించారు. అంతకు ముందు పెట్రోధరలు తగ్గించాలని, విద్యుత్‌ కోతలు ఉండవద్దని డిమాండ్‌ చేస్తూ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు శాసన మండలి ప్రాంగణంలోని ముఖ్యమంత్రి కార్యాలయం ముందు బైఠాయించారు. ముఖ్యమంత్రి వారిని పిలిపించి మాట్లాడినప్పటికీ వారు వెనక్కితగ్గలేదు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తరలించారు. అయితే ఎమ్మెల్యేలు మాత్రం పోలీసు వాహనంలోనే తమ నిరసన తెలియజేశారు. రైతులకు ఏడు గంటల విద్యుత్‌ ఇచ్చే వరకు తాము వాహనంలోనే ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాలకు తాము పోలీసు వాహనంలోనే వెళ్తామని చెప్పారు. దీంతో టిఆర్‌ఎస్‌ ఎమ్మేల్యేలతో చర్చించాలని మంత్రి పొన్నాలను ముఖ్యమంత్రి ఆదేశించారు.