ఏడోసారి ఎవరెస్ట్‌ అధిరోహించిన బీఎస్‌ఎఫ్‌ ఆఫీసర్‌

– అభినందనలు తెలిపిన ప్రధాని
న్యూఢిల్లీ, మే21(జ‌నం సాక్షి) : అసిస్టెంట్‌ కమాండెంట్‌ లవ్‌రాజ్‌ సింగ్‌ ధర్మశక్తు ఏడోసారి ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి జాతీయ రికార్డు నెలకొల్పారు. ఉత్తరాఖండ్‌ పితోర్‌ఘడ్‌లోని బోనా గ్రామానికి చెందిన లవ్‌రాజ్‌ ఆదివారం ఉదయం బీఎస్‌ఎఫ్‌ టీంతో కలిసి ఎవరెస్ట్‌ను అధిరోహించారు. పద్మ శ్రీ అవార్డు గ్రహీత అయిన ధర్మశక్తు.. గత ఏడాది మే 27 ఎవరెస్ట్‌ ఎక్కారు. తద్వారా ప్రపంచంలో ఎత్తయిన పర్వతాన్ని ఆరుసార్లు అధిరోహించిన తొలి భారతీయుడిగా రికార్డ్‌ నెలకొల్పారు. ఆదివారం మళ్లీ అధిరోహించడం ద్వారా తన రికార్డును మెరుగుపర్చుకున్నారు. ఆదివారం ఉదయం ఏడుగురు సభ్యులం కలిసి ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించామని ధర్మశక్తు శాటిలైట్‌ ఫోన్‌ ద్వారా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు తెలిపారు. సోమవారం మధ్యాహ్ననికి తిరిగి బేస్‌ క్యాంపు చేరుకుంటామని ఆయన చెప్పారు. 1998లో తొలిసారి ఎవరెస్ట్‌ ఎక్కిన ఆయన 2006, 2009, 2012, 2013, 2016లోనూ ఈ శిఖరాన్ని అధిరోహించారు. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన ధర్మశక్తును ప్రధాని అభినందించారు. ధర్మశక్తు ఆధ్వర్యంలో 25 మంది సభ్యులు ఎవరెస్ట్‌ అధిరోహణకు వెళ్లారు. ఏడుగురు సభ్యులకు ఆయన నేతృత్వం వహించగా.. డిప్యూటీ కమాండెంట్‌ అవినాష్‌ నేగి నేతృత్వంలోని రెండో టీం కూడా ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహిస్తోంది. తమ టీం ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోంచడం ఆనందంగా ఉందని బీఎస్‌ఎఫ్‌ ఐజీ డీకే ఉపాధ్యాయ తెలిపారు. ఎవరెస్ట్‌ శిఖరంపై ఇతర పర్వతారోహకులు పడేసిన చెత్తను లవ్‌రాజ్‌ టీం బేస్‌ క్యాంప్‌కి తీసుకురానుంది. క్లీన్‌ గంగ, క్లీన్‌ హిమాలయ కోసం ధర్మశక్తు ప్రచారం చేస్తున్నారు.