ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో డోప్‌ దొంగలు నలుగురిపై ఐఓసీ వేటు

లాసన్‌ (స్విట్జర్లాండ్‌) ,డిస్శెబ్‌, 6 (టన్శసలక్ఞ్ష):  అంతర్జాతీయ క్రీడారంగానికి మరో మాయని మచ్చ… మరోసారి డోపింగ్‌ భూతం వెలుగులోకి వచ్చింది.2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌కు సంబంధించి నలుగురు అథ్లెట్లు డోప్‌ టెస్టుల్లో పట్టుబడ్డారని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఇవాళ ప్రకటించింది. ఆ నలుగురినీ ఒలింపిక్స్‌ నుండి డిస్‌క్వాలిఫై చేసినట్టు తెలిపింది. దాదాపు ఎనిమిదేళ్ళ క్రితం అథ్లెట్ల నుండి సేకరించిన శాంపిల్స్‌ను వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఇటీవలే మళ్ళీ పరీక్షించారు. ఈ టెస్టుల్లో నలుగురు అథ్లెట్ల శాంపిల్స్‌ పాజిటివ్‌గా తేలాయి. దీనిలో ఉక్రెయిన్‌కు చెందిన షాట్‌పుట్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ యూరీ బిలాంగాంగ్‌ కూడా ఉన్నాడు.  మిగిలిన వారిలో హ్యామర్‌ త్రోలో సిల్వర్‌ మెడల్‌ నెగ్గిన బెలారస్‌ అథ్లెట్‌ ఇవాన్‌ టిక్కాన్‌ , రష్యా మహిళా షాట్‌ పుట్టర్‌ స్వెత్లానా క్రివిల్వోవా , బెలారస్‌ డిస్కస్‌ త్రోవర్‌ యాచింకో ఉన్నారు. అయితే ఐదో అథ్లెట్‌ రష్యాకు చెందిన వెయిట్‌లిఫ్టర్‌ ఒలెగ్‌ పెర్పెచ్‌నొవ్‌ కేసు మాత్రం పెండింగ్‌లో పెట్టారు. ఇదిలా ఉంటే సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న సైక్లిస్ట్‌ లాన్స్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌పై ఐవొసి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఇటీవలే డోపింగ్‌ స్కాండిల్‌లో దొరికిపోయి నిషేధానికి గురయ్యాడు. అతను ఉత్పేర్రకాలు వాడిన జాబితాలో సిడ్నీ ఒలింపిక్స్‌ కూడా ఉన్నట్టు సమాచారం. దీంతో అతని నుండి మెడల్‌ వెనక్కి తీసుకునేందుకు ఐవొసి సిధ్ధమైంది. యుఎస్‌ఎ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్మ్‌స్ట్రాంగ్‌ నెగ్గిన టూర్‌ ది ఫ్రాన్స్‌ టైటిల్స్‌ ఇప్పటికే వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం ఐవొసి కూడా సిడ్నీ మెడల్‌ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అయితే సైక్లింగ్‌ గవర్నింగ్‌ బాడీ అనుమతి కోసం ఎదురుచూస్తోంది.