ఏపీఎస్‌పీ ఎనిమిదో బెటాలియన్‌లో ఉద్రిక్తత

కమాండెంట్‌ వేధింపులను నిరసిస్తూ కానిస్టేబుళ్ల భార్యల ధర్నా
హైదరాబాద్‌, ఆగస్టు 4 : కొండాపూర్‌ 8వ బెటాలియన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు సెలవులు ఇవ్వాలంటూ వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనను చిత్రీకరిస్తున్న ఐజీ వెంకటేశ్వరరావు డ్రైవర్‌పై దాడి చేశారు. స్వల్ప గాయాల పాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. శనివారం మధ్యాహ్నం8వ బెటాలియన్‌ కార్యాలయం గేటు వద్దకు చేరుకున్న పోలీసుల భార్యలు, కుటుంబ సభ్యులు బైఠాయించారు. తమ భర్తలకు సెలవులు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని కోరారు. ఒక అధికారి లంచాలు తీసుకుంటూ సెలవులు మంజూరు చేస్తున్నారన్నారు. తమ భర్తలను శ్రీకాకుళం, విశాఖపట్నం, తదితర ప్రాంతాలకు విధుల నిర్వహణకు పంపుతున్నారన్నారు. వారు అనారోగ్యానికి గురవుతున్నా రన్నారు. వారు అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించుకున్న దాఖలాల్లేవన్నారు. మూడు రోజుల క్రితం విధుల నిర్వహణలో ఒక కానిస్టేబుల్‌ మృతి చెందితే.. నేటివరకు ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదని ధ్వజమెత్తారు. ఆ విషయం తేల్చే వరకు ఇక్కడి నుంచి కదలబోమని భీష్మించుకు కూర్చున్నారు. డీజీపీ దినేష్‌రెడ్డి వచ్చి హామీ ఇచ్చేంతవరకు తమ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. ఈ సమాచారం అందుకున్న 8వ బెటాలియన్‌ ఐజీ వెంకటేశ్వరరావు సిబ్బంది కుటుంబ సభ్యుల వద్దకు వచ్చి చర్చలకు రావాలని ఆహ్వానించారు. ఇక్కడే తేల్చాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. ఈ దృశ్యాలను ఐజి వెంకటేశ్వరరావు కారు డ్రైవర్‌ చిత్రీకరిస్తుండగా అతనిపై కొందరు దాడి చేశారు. కెమెరాను లాగివేశారు. ఆయనపై పిడి గుద్దులు కురిపించారు. సంఘటన స్థలంలో ఉన్న కమాండెంట్లు జోక్యం చేసుకుని అతడ్ని అక్కడి నుంచి ఆసుపత్రికి పంపించారు. అనంతరం ఐజీతో చర్చలు జరిపేందుకు ఒక బృందం లోపలికి వెళ్లింది. సాయంత్రానికల్లా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.