ఏపీలో అవినీతి, అరాచక పాలన సాగుతుంది
– అవినీతి అందలమెక్కి బాబు కులుకుతున్నారు
– దమ్ముంటే రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం వాటా, రాష్ట్రం వాటాపై శ్వేతపత్రం విడుదలచేయాలి
– బీజేపీని దోషిగా చూపి ఎన్నికలకు వెళ్లాలని బాబు చూస్తున్నాడు
– ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
కర్నూలు, జూన్29(జనం సాక్షి) : రాష్ట్రంలో అవినీతి, అరాచక, అసమర్థత పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. కడప ఉక్కు పరిశ్రమ సమాచారాన్ని కేంద్ర ఉక్కు శాఖా మంత్రికి ఇవ్వకుండా.. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రమేష్‌తో దీక్ష చేయిస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతి అందెలమెక్కి కులుకుతున్నారని అన్నారు. సోమ్ము మాది.. అవినీతి విూది అని మండిపడ్డారు. బాబు విూకు దమ్ముంటే రాష్ట్ర అభివృద్ధిపై రాష్ట్ర వాటా, కేంద్రం వాటాపై శ్వేతపత్రం విడుదల చేయండని డిమాండ్ చేశారు.
దేశంలో పేదరిక నిర్మూలన కోసం ప్రధాని నరేంద్ర మోదీ 150 సంక్షేమ పథకాలు ప్రవేశపేట్టారని గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. బాబు బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని తెలిపారు. బాబులో ఒక అపరిచితున్ని చూస్తున్నామని కన్నా అన్నారు. జిల్లాకు నాలుగేళ్లలో కేంద్రం 14 విద్యా సంస్థలు నెలకొల్పిందని పేర్కొన్నారు. తక్కువ ఫీజుతో ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.