ఏపీలో చెల్లని రూపాయి… తెలంగాణలో చెల్లుతుందా?
– ఏపీ ప్రజలకు చంద్రబాబు 600 హావిూలిచ్చాడు
– ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయాడు
– ఇప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు
– ప్రజాకూటమి కాదు.. దగా కూటమి
– ఆయకట్టు పెరిగితే అంచనా వ్యయం పెరగదా?
– టీఆర్‌ఎస్‌ను విమర్శించే అర్హత కోదండరాంకు లేదు
– చంద్రబాబుకు ప్రతీసారి చారిత్రక పొత్తేనా?
– ప్రజాకూటమికి ఓటుతో బుద్దిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
– విలేకరుల సమావేశంలో ఆపద్ధర్మ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్, నవంబర్29(జనంసాక్షి) : చంద్రబాబు నాయుడు ఏపీలో ఇచ్చిన హావిూలను పరిష్కరించడంలో
విఫలమయ్యాడని, ఇప్పుడు తెలంగాణలో ప్రజా కూటమితో హావిూలు అమలు చేస్తామని అనడం విడ్డూరంగా ఉందని, ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా అని ఆపద్ధర్మ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. ఆంధప్రదేశ్ ప్రజలను నిలువునా ముంచారని, ఇక్కడి ప్రజలను ముంచేందుకు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో హరీష్‌రావు మాట్లాడారు.. ఏపీలో రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో.. వారు రోడ్డున పడ్డారని వ్యాఖ్యానించారు. ఏపీలో డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు.. వడ్డీలు కూడా కట్టలేదని ఆరోపించారు. టీడీపీ మేనిఫెస్టోపై ఏపీ కాంగ్రెస్ విడుదల చేసిన చార్జ్‌షీట్‌ను ఆయన విూడియాకు చూపెట్టారు. ఏపీలో హావిూలు అమలు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ వారం రోజులు ‘ప్రజావంచన వారం’ పేరుతో నిరసన దీక్షలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా అని హరీష్‌రావు ప్రశ్నించారు. టీడీపీ మిత్రపక్షమైన కాంగ్రెస్సే చంద్రబాబు పాలన వైఫల్యాలను ఎత్తిచూపిందని అన్నారు. ఏపీ కాంగ్రెస్‌కు నచ్చని చంద్రబాబు టీ కాంగ్రెస్‌కు ఎలా నచ్చారో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబుని నిలదీశారు. చంద్రబాబును ఓడించాలని అక్కడి రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఏపీ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. ఏపీలో ఇచ్చిన హావిూలు ఎందుకు అమలు చేయలేదో చెప్పిన తరువాతే చంద్రబాబు తెలంగాణలో తిరగాలన్నారు.
టీడీపీ, కాంగ్రెస్‌లు చేయలేనివి కేసీఆర్ చేశారు ..
గతంలో టీడీపీ, కాంగ్రెస్‌లు తెలంగాణకు ఇచ్చిన హావిూలు నెరవేర్చలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ చేయలేనివి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. వారిది ప్రజాకూటమి కాదని.. దగా కూటమి అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హావిూలను కేసీఆర్ అమలు చేశారని తెలిపారు. రాహుల్, చంద్రబాబు తెలంగాణ ప్రజల చెవ్వుల్లో పూలు పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు చంద్రబాబు చేసిన అభివృద్ధి నిరోధక చర్యలను ప్రజలు మర్చిపోరని వ్యాఖ్యానించారు. అప్పులు తెచ్చిన విషయంలో చంద్రబాబుతో చర్చకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. మహాకూటమిలో తెలంగాణ జనసమితి కోదండరాం టికెట్ దక్కలేదని, అలాంటి కోదండరాంకు తమ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయి నమ్మకం ఉందన్నారు. రాహుల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.
బాబుది ప్రతీసారి చారిత్రక పొత్తేనా?
2014లో భారతీయ జనతా పార్టీతో పొత్తును చారిత్రక అవసరమని చంద్రబాబు చెప్పారని, ఇప్పుడేమో కాంగ్రెస్‌తో పొత్తు చారిత్రక అవసరమని అంటున్నారని, ఆయన ఎవరితో కలిసినా చారిత్రక పొత్తేనా అని హరీష్‌రావు ప్రశ్నించారు. నాలుగేళ్లు మోదీతో కలిసి ఉన్నప్పుడు లౌకికవాదం
ఎక్కడికిపోయిందని ప్రశ్నించారు. హైకోర్టు విభజన కోసం మోదీని కేసీఆర్ నాలుగు సార్లు కలిశారని, ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు హైకోర్టు విభజనను అడ్డుకున్నారని అన్నారు. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూలదోయాలని చూశారని విమర్శించారు.
ఆయకట్టు పెరిగితే అంచనాలు పెరగవా?
‘ప్రాణహిత- చేవెళ్లకు 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. 16 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు ప్రాణహిత- చేవెళ్లను చేపట్టారని, మేం అధికారంలోకి వచ్చాక ఆయకట్టును 37 లక్షల ఎకరాలకు
పెంచామన్నారు. ఆయకట్టు పెరిగితే అంచనా వ్యయం పెరగదా? కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రూ.17 వేల కోట్ల నుంచి రూ.38,500 కోట్లకు పెంచలేదా అని ప్రశ్నించారు. సముద్రంలో కలిసే నీళ్లను వాడుకునేందుకు కాళేశ్వరం చేపడితే చంద్రబాబు ఎందుకు లేఖ రాశారని హరీశ్ రావు నిలదీశారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఆపాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారని హరీశ్‌రావు అన్నారు.
–