ఏపీలో టీఆర్‌ఎస్సే పెద్దపార్టీగా అవతరిస్తుంది

కేకేకు పదవిచ్చేంత పెద్దోన్ని కాదు
సీమాంధ్ర పత్రికలు.. చిల్లర రాతలు
కేసీఆర్‌ ఫైర్‌
హైదరాబాద్‌, జూన్‌ 18(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రాన్ని సార్వత్రిక ఎన్నికలలోపే సాధించాలనేది తమ ఉద్దేశ్యమని, ఇందుకోసమే పోరాటాలు చేస్తున్నామని, అయినా కేంద్రం తలొగ్గకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించడం ఖాయమని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. సీనియర్‌ నేత కె. కేశవరావు పార్టీ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణకు చెందిన టీఆర్‌ఎస్‌ 100 అసెంబ్లీ, 16 ఎంసీ సీట్లను గెలుచుకుని రాష్ట్రంలో సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించి తీరుతుందన్నారు. ఆనాడు రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుతో పాటు జాతీయ స్థాయిలో కూడా 16 ఎంపీలను కైవసం చేసుకుని కేంద్ర ప్రభుత్వంలో కూడా కీలక భూమికను పోషిస్తామన్నారు. ఆంధ్రలో మూడు పార్టీలు సీట్లను పంచుకోవాల్సి ఉంటుందన్నారు. తెగేదాక వచ్చినాక ఇంకా సమావేశాలు తొక్కా..తొండెం అంటూ కాలయాపన చేస్తూ టీ కాంగ్రెస్‌ నేతలు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇంకా టీ టీడీపీ, టీ కాంగ్రెస్‌ అనే సంఘాలు అవసరమా అని నిలదీశారు. 50`60 ఏళ్లపాటు కాంగ్రెస్‌లో ఉండడమేకాక అపార అనుభవం గడిరచిన కేకే కంటే ఈ టీ కాంగ్రెస్‌ నేతలు తురుంఖాన్‌లేం కాదన్నారు. ఆయనే కాంగ్రెస్‌ను అతిదగ్గరగా చూసి విసుగు చెంది పార్టీని వీడారని ఆయనను మార్గదర్శనంగా తీసుకుని దమ్ముంటే బయటకు రావాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ ఉద్యమంలో కనిపించలేదని పేర్కొనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. కేసీఆర్‌ బహుముఖ ఉద్యమకారి అన్నారు. ఆ ఆరోపణలను సున్నితంగా కొట్టిపారేశారు. చలో అసెంబ్లీ విజయవంతంగా ముగిసినా పోలీసులు పెట్టిన హింసలకు వ్యతిరేకంగా బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. టీఆర్‌ఎస్‌ కూడా ఓ రాజకీయ పార్టీయేనని గుర్తుంచుకోవాలని తనను ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్న వారిపై మండి పడ్డారు. నాన్సెన్స్‌ వ్యవహారాలు మానుకోవాలని హెచ్చరించారు. ఓరాజకీయ పార్టీగా తమ నిర్ణయం తాము తీసుకున్నామన్నారు. అన్నింటిని టీ జేఏసీ ద్వారానే చేయాలనడం సరైంది కానే కాదన్నారు. ఒక్కో పోలీస్‌స్టేషన్‌లో 800 నుంచి 1200 మందిని బైండోవర్లు చేశారని, వేలాదిమందిని అరెస్ట్‌లు చేశారని, అయినా హైదరాబాద్‌లో ఏం జరిగిందో చూసిన ప్రతి ఒక్కరు ఉద్యమకారులు గెలిచారని అనుకుంటుంటే కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం విజయంగా భావించడం మూర్కత్వమే అవుతుందన్నారు. 58 వేల మందిని బైండోవర్‌ చేయడమా ప్రభుత్వ విజయమా అని ప్రశ్నించారు. పిచ్చిపిచ్చి రాతలతో, కిరికిరి వ్యాసాలతో వార్తలు రాస్తూ ఉద్యమాన్ని మలినం చేస్తామనుకుంటే అది వారి అవివేకానికి నిదర్శనమే అవుతుందన్నారు. హైదరాబాద్‌ రాజధానితో కూడుకుని 10 జిల్లాల తెలంగాణాయే సాధిస్తామన్నారు. అది కాకుండా మరో ప్రతిపాదనేది తెచ్చినా అంగీకరించేది లేదన్నారు. ప్యాకేజీలు, తొక్క… తొండం అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్‌ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలే బే ఆఫ్‌ బెంగాల్‌లో పడేస్తారన్నారు. మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్న జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమిపై సంప్రతించారా అన్న ప్రశ్నకు కేకేతో మాట్లాడారన్నారు. ఇకనుంచి కేకేనే ఇలాంటి వ్యవహారాలన్నీ చూసుకుంటారన్నారు. కేకేకు పదవిచ్చేంత స్థాయి, అనుభవం, వయస్సు తనకు లేదన్నారు. కలిసి పనిచేసేందుకే అధ్యక్షుడితో సమానమైన సెక్రటరీ జనరల్‌ పోస్టును కేకేకు అప్పగించామన్నారు.  జాతీయ స్థాయిలో చక్రం తిప్పే బాధ్యతలను కేకే చూసుకుంటారన్నారు. ఆయనమరో ఇద్దరు ముగ్గురు సభ్యులతో కమిటీ వేసుకుంటారన్నారు. ఈ కమిటీ జాతీయ స్థాయిలో పార్టీలతో చర్చించడం, కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంతో కూడా కేకే ఆధ్వర్యంలోని కమిటీయే చూసుకుంటుందన్నారు. ఎంతో అనుభవం ఉన్న కేకే ముందు తాను చాలా చిన్నవాడినన్నారు. ఆయన ఆశీస్సుల కోసం తాను ప్రయత్నిస్తుంటానన్నారు. కేశవరావు కౌన్సిల్‌లో మంచి మంచి ఉపన్యాసాలిచ్చేవాడని, ఆఉపన్యాసాలు వినేందుకు తాను ఎంఎ పొలిటికల్‌ సైన్స్‌లో విద్యార్థిగా ఉండి అసెంబ్లీకి వెళ్లానని గుర్తుచేసుకున్నారు. కేశవరావు ప్రసంగం అంటే ఆరోజుల్లో ఎంత విలువుండేదో అంతే పదునుతో నేడు ఉందన్నారు. టిజెఎసి స్టీరింగ్‌ కమిటీ సమావేశం నేడు జరుగుతోందని, ఆతర్వాత జరిగే విస్తృత స్థాయి సమావేశానికి తాను వెళ్తనన్నారు. ఉద్యమ కార్యాచరణపై ప్రతిపాదనలు నేడు తయారు చేస్తున్నారన్నారు. విూడియా సమావేశంలో నాయిని నర్సింహారెడ్డి, కేకే, కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్‌ పాల్గొన్నారు.