ఏపీలో రహదారులకు మహర్దశ

– రహదారుల నిర్మాణానికి రూ.4,234 కోట్లు విడుదల
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి, మే30(జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్రామాల్లో రహదార్లకు మహర్థశ పట్టనుంది. రూ. 4234 కోట్ల రూపాయిల నిధులతో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో మెరుగైన రహదారులు, లింక్‌ రోడ్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి నారా లోకేశ్‌ఐఐబీ నిధులతో అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. త్వరలోనే ఈ రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. 250 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో తారు, సిమెంట్‌ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఎక్స్‌ టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్‌ లో భాగంగా ఈ పనులు జరగనున్నాయి. త్వరలోనే గ్రామాల్లో ఈ పనులు ప్రారంభం కానున్నాయి. 3575.93 కోట్ల నిధులతో 2440 పనులు చేపట్టనున్నారు. 4825 కిలోవిూటర్ల రోడ్డు నిర్మాణం కోసం ఈ మేర 59వ నెంబర్‌ జీవోను విడుదల చేశారు. దీని ద్వారా 3274 నివాస ప్రాంతాలకు రహదారులు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ కింద 17 లక్షల మంది జనాభాకు రహదారి సదుపాయం కల్పిస్తారు. నవంబర్‌ 2018 నాటికి అన్ని పనులు ప్రారంభించి…. 2020 నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజనలో భాగంగా… ఆంధప్రదేశ్‌ ప్రభుత్వ వాటా నిధులు కలుపుకుని ఈ ప్రాజెక్టులు చేపడతారు. 250కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో 167.65 కోట్లతో రోడ్ల నిర్మాణానికి మరో జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. దీని ద్వారా 81 పనుల్లో భాగంగా,1085 కిలోవిూటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు.