ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..

– నాలుగు బోగీలు పూర్తిగా దగ్ధం
– సురక్షితంగా బయటపడ్డ 36 మంది ట్రైనీ ఐఏఎస్‌లు
గ్వాలియర్‌, మే21(జ‌నం సాక్షి) : మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ వద్ద ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి విశాఖ వస్తోన్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బిర్లా నగర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి నాలుగు బోగీలకు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు రైలు నుంచి దిగారు. వీరిలో 36 మంది శిక్షణలో ఉన్న ఐఏఎస్‌లు కూడా ఉన్నారు. ప్యాంట్రీ కారుకు ముందున్న బోగీలో షార్ట్‌సర్య్కూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అనంతరం మంటలు బి-5, బి-6, బి-7 బోగీలకు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో రైలు బిర్లానగర్‌ స్టేషన్‌ వద్ద ఆగి ఉంది. అదే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ప్రయాణికులు వెనువెంటనే రైలు నుంచి దిగారు. సిగ్నల్‌ ఇచ్చి ఉంటే రైలు అక్కడి నుంచి కదిలేదని.. ఆ సమయంలో కదులుతున్న రైల్లోంచి దూకాల్సి వచ్చేదని ప్రయాణికులు చెబుతున్నారు. రైలు ఆగి ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు.