ఏపీ డీజీపీ రేసులో ఆ ఐదుగురు
– ప్రభుత్వానికి నివేదిక అందజేసిన సెలక్షన్ కమిటీ
– గౌతమ్ సవాంగ్, ఠాకూర్ల మధ్య తీవ్ర పోటీ
అమరావతి, జూన్29(జనం సాక్షి): ఆంధప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఎంపికపై సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ ఐదుమంది అధికారుల పేర్లను డీజీపీ పోస్టు కోసం ఎంపిక చేసింది. ఈ జాబితాలో గౌతమ్ సవాంగ్, ఠాకూర్, కౌముది, అనురాధ, సురేంద్రబాబుల పేర్లు ఉన్నాయి. అంతేకాక అధికారుల ట్రాక్ రికార్డు, సర్వీస్ వివరాలను కూడా నివేదికలో పొందుపరిచింది. సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై నేడు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్, అవినీతి నిరోధక శాఖ డీజీ ఠాకూర్ల మధ్య డీజీపీ పదవి కోసం పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే శనివారం ఉదయం జీవో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సవాంగ్, ఠాకూర్‌లలో ఒకరికి అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆంధప్రదేశ్ రాష్ట్ర డీజీపీ పోస్టు కోసం ఐపీఎస్ అధికారుల మధ్య విపరీత పోటీ నెలకున్న విషయం తెలిసిందే. ఇన్‌చార్జ్ చీఫ్ సెక్రటరీ ఏసీ పునేఠా నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు మన్మోహన్ సింగ్, సాంబశివరావులతో పాటు జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్‌లు సెర్చ్ కమిటీలో ఉన్నారు. ఈ నెల(జూన్) 30న ప్రస్తుత డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే.