ఏపీ మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం
టిడిపి శ్రేణుల్లో తాజాగ చర్చ ఇదే
అమరావతి,జూలై5(జనం సాక్షి): ఇదిగో ఎన్నికలు..అదిగో ఎన్నికలు అంటున్న వేళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన వార్తలు గుప్పుమన్నాయి. స్వల్ప విస్తరణ తప్పదేమో అన్న రీతిలో పుకార్లు శికారు చేస్తున్నాయి. బిజెపికి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో వారి స్థానంలో మైనార్టీ,ఎస్టీల నుంచి భర్తీ చేయాలని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లుగా ప్రచారం సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు విస్తరణ నిర్ణయం తీసుకో నున్నారని, ముస్లిం, మైనార్టీలతో పాటు బలహీన వర్గాలకు మంత్రి వర్గంలో చోటు ఖాయమైపోయిందని అంటున్నారు. పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నవారికి మంత్రి పదవి కట్టబెట్టనున్నారా? అన్న ప్రశ్నలకు తెదేపా శ్రేణులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ ఖాయమన్న సంకేతాలతో తెలుగు తమ్ముళ్లలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికలకు సమయం తక్కువగానే ఉన్నా మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మంత్రివర్గ విస్తరణపై త్వరలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం తెదేపా వర్గాల్లో జోరందుకుంది. మంత్రి పదవులకు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాలను ముస్లిం, మైనార్టీ, ఎస్టీ నేతలతో భర్తీ చేసే అవకాశాలను చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేసి వివిధ వర్గాలను సంతృప్తి పరచాలన్నది సీఎం అభిమతంగా అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం ఎంతో కీలకం కానుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.