ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డా : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ఇంటిలిజెన్స్ పోలీసులతో పెత్తనం చేసే కుట్ర
మండిపడ్డ టిఆర్‌ఎస్ నేతలు
హైదరాబాద్,సెప్టెంబర్15(జనంసాక్షి): తెలంగాణ నుంచి చంద్రబాబు నాయుడిని తరిమికొట్టినా కాంగ్రెస్ తోకపట్టుకుని మళ్లీ వస్తున్నడని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి,బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్‌లో విూడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాత్రికి రాత్రే ఏడు మండలాలను గుంజుకునేలా చంద్రబాబు చేశాడన్నారు. సీలేరు ప్రాజెక్టును కూడా అదేవిధంగా లాక్కున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణలో జరిగిన ప్రతీ ఉప ఎన్నికలో చంద్రబాబు విచ్చలవిడిగా ఖర్చు చేసినా ఓటమి తప్పలేదని గుర్తుచేశారు. ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికిపోయాడన్నారు. తెలంగాణలో శాంతి భద్రతల రక్షణ కోసం గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడి నుంచి ఏపీ పోలీసులను అర్జెంటుగా తీసుకువెళ్లాల్సిందిగా పేర్కొన్నారు. చంద్రబాబు చీకటి రాజకీయాలు.. వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలని ఎంపి బాల్క సుమన్ హెచ్చరించారు. తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయాలని చంద్రబాబు చేస్తున్న కుట్రలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. నక్కజిత్తుల నారాబాబు ఆంధ్ర ప్రజలకు చెందిన కోట్లాది రూపాయలు తెచ్చి తెలంగాణలో కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. ఆంధ్రా పోలీసులు తెలంగాణలో అడ్డా పెట్టడం అనైతిక చర్య అని ఎంపీ సుమన్ స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయాలని చూస్తున్న టీడీపీ కుట్రలపై గవర్నర్ స్పందించాలని కోరారు. టీడీపీ డబ్బును పట్టుకొని పోలీసులకు అప్పజెప్తామన్నారు. బాబు ఏజెంట్లు కాంగ్రెస్‌లో ఉన్నారని, చంద్రబాబు చర్యలకు మా ప్రతిచర్య తీవ్రంగా ఉంటదని స్పష్టం చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో 100 మందికి పైగా పోలీసులు ఇక్కడ మొహరించారని, ఏపీ నుంచి వందల కోట్లను ఇక్కడికి దిగుమతి చేసి గోల్‌మాల్ చేయాలని చూస్తున్నారని సుమన్ వివరించారు. నాలుగు ఓట్లు రాలుతాయనే ఆశతో కుట్రల కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టిందని మండిపడ్డారు. ఏపీ పోలీసులు పచ్చ పార్టీ ఏజెంట్లుగా మారారని విమర్శించారు. ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దానికి బాధ్యత చంద్రబాబుదే అన్నారు. తెలంగాణలో
రాజకీయాలు చేయాలంటే చంద్రబాబు మగాడిలా ముందుకు రావాలి కానీ.. దొంగలా రావొద్దని గట్టు రామచంద్రరావు సవాల్ చేశారు. చంద్రబాబు బతుకంతా దొంగ రాజకీయాలేనని, బాబు విచ్ఛిన్నకర కుట్రలను ఎదుర్కోవడానికి తెలంగాణ సమాజమంతా రెడీగా ఉందన్నారు. చంద్రబాబు తెలివైన దొంగ అని, తెలంగాణను పాడు చేయడానికి ఆయన టీడీపీ ఆఫీసులో డెన్‌ను ఏర్పాటు చేశాడని విమర్శించారు. అవినీతితో అడ్డదిడ్డంగా సంపాదించిన ధనంతో తెలంగాణను నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నాడని, టీడీపీ కుట్రలను ఎలా విచ్ఛిన్నం చేయాలో టీఆర్‌ఎస్‌కు తెలుసన్నారు. చంద్రబాబు తెలంగాణలో ఎలాంటి కుట్రలు చేయాలని చూసినా ఊరుకోం.. తరిమి కొడతామని గట్టు హెచ్చరించారు. ఇక్కడి నుంచి చంద్రబాబు డెన్ తీసేయకుంటే తర్వాత జరిగే పరిణామాలకు తమ బాధ్యత లేదన్నారు. చంద్రబాబు భయంతో ఒక నోటీస్ పట్టుకొని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. బాబు విూద కేసు కొట్టేయాలని తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రను కోరాలని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు కుట్రలకు కాంగ్రెస్ బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్‌లో చంద్రబాబు తన కోవర్టులను పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని, కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేకుండా చంద్రబాబు చుట్టూ తిరుగుతోందని మండిపడ్డారు. ఏపీ పోలీసులను చంద్రబాబు దొంగలుగా వాడుకుంటున్నారని, ఏబీ వెంకటేశ్వరరావు ఆంధ్రా బాబుకి బ్రోకర్‌గా మారాడని మండిపడ్డారు. వందల కోట్ల రూపాయలు పోలీసుల ద్వారా తెలంగాణలో పంచే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ఆంధ్రా పోలీసుల్లో కూడా తెలంగాణ శ్రేయోభిలాషులు ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఇక్కడి నుంచి పంపించాలని గవర్నర్, డీజీపీ, ఈసీకి ఫిర్యాదు చేస్తామని గట్టు రామచంద్రరావు తెలిపారు.