ఐఎన్‌ఎక్స్‌ కేసులో చిదంబరానికి ఊరట

– జులై 2వరకు అరెస్టు చేయొద్దు
– సీబీఐని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, మే31(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి ఐఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో ఊరట లభించింది. ఆయనను సీబీఐ అరెస్ట్‌ చేయకుండా ఢిల్లీ హైకోర్టు గురువారం తాత్కాలిక రక్షణ కల్పించింది. జులై 3 వరకు ఆయనను అరెస్ట్‌ చేయొద్దని కోర్టు సీబీఐని ఆదేశించింది. అయితే ఐఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో విచారణకు సహకరించాలని కోర్టు చిదంబరాన్ని ఆదేశించింది. సీబీఐ ప్రశ్నించడానికి పిలిచినప్పుడు వెళ్లాలని చెప్పింది. అలాగే చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ స్పందన కోరింది. ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో జూన్‌ 5 వరకు చిదంబరాన్ని అరెస్ట్‌ చేయొద్దని బుధవారం ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు చిదంబరం తరఫున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వి హాజరవ్వగా.. సీబీఐ తరఫున ఏఎస్‌జీ తుషార్‌ మెహతా వాదించారు. ఐఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో విచారణకు హాజరయ్యేందుకు జూన్‌ 6 వరకు సమయం ఇవ్వాలని, ఆ తర్వాతే తనను ప్రశ్నించడానికి పిలవాలని చిదంబరం సీబీఐని కోరారు. ఇదిలా ఉంటే కేసులో విచారణ సందర్భంగా తమ ఎదుట హాజరు కావాలని చిదంబరానికి సీబీఐ నోటీసులు జారీచేసింది. దీంతో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు
చిదంబరం సీబీఐ కేంద్ర కార్యాలయానికి  వెళ్లారు.