ఐఎస్‌ఐ మాజీ చీఫ్‌కు పాక్‌ ఆర్మీ సమన్లు

న్యూఢిల్లీ, మే26(జ‌నంసాక్షి) : పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ) మాజీ చీఫ్‌ అసద్‌ దుర్హానీకి ఆదేశ ఆర్మీ సమన్లు జారీ చేసింది. రీసర్చ్‌ అండ్‌ అనాలసిన్‌ వింగ్‌కు చెందిన మాజీ చీఫ్‌ ఏఎస్‌ దులత్‌తో కలిసి అసద్‌ దుర్హానీ ఓ పుస్తకం రాశారు. ద స్పై క్రానికల్స్‌: రా, ఐఎస్‌ఐ అండ్‌ ద ఇల్యూజన్‌ ఆఫీ పీస్‌ అన్న టైటిల్‌తో దాన్ని రెండు రోజుల క్రితం రిలీజ్‌ చేశారు. అయితే మిలిటరీ నియమావళిని ఉల్లంఘిస్తూ ఐఎస్‌ఐ మాజీ చీఫ్‌ పుసక్తం కోసం తన అభిప్రాయాలను పంచుకున్నారని పాకిస్థాన్‌ ఆర్మీ ఆరోపించింది. దీనికి సంబంధించి పాక్‌ ఆర్మీ ప్రతినిధి మేజర్‌ జనరల్‌ అసిఫ్‌ గఫూర్‌ ఓ ట్వీట్‌ చేశారు. మే 28న అసద్‌ దుర్హానీ .. ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు రావాలంటూ ఆదేశించినట్లు ఆ ట్వీట్‌లో తెలిపారు. స్పై క్రానికల్స్‌ పుస్తకం కోసం పంచుకున్న అభిప్రాయాలను పాక్‌ అడిగి తెలుసుకోనున్నది. రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తలను తగ్గించాలన్న నేపథ్యంలోనే పుస్తకాన్ని రాసినట్లు మాజీ గూఢాచారులు వెల్లడిస్తున్నారు. ఆ
పుస్తకంలో గూఢాచారులిద్దరూ… ఆఫ్ఘనిస్థాన్‌, పర్వేజ్‌ ముషర్రఫ్‌, నవాజ్‌ షరీఫ్‌, అజిత్‌ దోవల్‌, కుల్‌భూషణ్‌ జాదవ్‌, కశ్మీర్‌, మోదీ లాంటి అంశాలపై చర్చించారు. ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ను పట్టుకున్న ఆపరేషన్‌కు సంబంధించిన అంశాలన్నీ పాకిస్థాన్‌కు ముందే తెలుసు అని దుర్హానీ ఆ పుస్తకంలో వెల్లడించారు. కుల్‌భూషణ్‌ జాదవ్‌ను నిర్బంధించిన కేసులోనూ ఆయన పాక్‌ తీరును తప్పుపట్టారు. హురియత్‌ వేర్పాటువాద సంస్థను పాకిస్థానే స్థాపించిందన్నారు.