ఐఎస్‌ మిలిటెంట్ల ఊచకోత

1
-21 మంది హతం

-వైమానిక దాడులకు దిగిన ఈజిప్ట్‌

కైరో,ఫిబ్రవరి16(జనంసాక్షి): వరుస ఊచకూతలతో వణుకుపుట్టిస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులు లిబియాలో మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఈసారి 21 మంది క్రిస్టియన్లను టార్గెట్‌ చేశారు. గత ఏడాది బందీలుగా పట్టుకున్న 21 మంది ఈజిప్ట్‌ క్రిస్టియన్లను ఊచకోత కోసి ఆ విజువల్స్‌ ను విడుదల చేశారు. ఒసామా బిన్‌ లాడెన్‌ రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఐ.ఎస్‌.ఐ.ఎస్‌ తీవ్రవాదులు ప్రకటన చేశారు. గత హత్యల మాదిరిగానే ఈసారి కూడా బందీలందరికీ కాషాయ దుస్తులు తొడిగించి..మోకాళ్లపై నిల్చోబెట్టి గొంతులు కోశారు. తమ దేశస్థుల దారుణ హత్య సమాచారం తెలిసిన వెంటనే ఈజిప్ట్‌ యుద్ధ విమానాలు లిబియాలోని ఐ.ఎస్‌.ఐ.ఎస్‌ తీవ్రవాద ప్రాంతాలపై దాడులకు దిగాయి. ఐ.ఎస్‌.ఐ.ఎస్‌పై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఈజిప్ట్‌ ప్రధాని శిశి అన్నారు. దీంతో  లిబియాలో ఈజిప్టు వైమానిక దాడులకు దిగింది. లిబియాలోని ఐఎస్‌ ఉగ్రవాదుల స్థావరాలు, ఆయుధాలు భద్రపరిచే ప్రదేశాలు, ఉగ్రవాదుల శిక్షణ ప్రదేశాలు లక్ష్యంగా ఈజిప్టు వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. 21 మంది ఈజిప్టు పౌరుల ఊచకోతకు ప్రతీకారంగా ఆ దేశం దాడులకు పాల్పడుతోంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈజిప్టు పౌరుల తలనరికి చంపుతున్న వీడియోను ఐఎస్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ఈజిప్టు అధ్యక్షుడు ఆబ్డెల్‌ ఫతాహ్‌ అల్‌-సిసి తీవ్రంగా వ్యతిరేకించారు. లిబియాలోని ఉగ్రవాదులు ఈజిప్టు భద్రతకు పెను ముప్పుగా మారారన్నారు. ఉద్యోగాలు వెతుక్కోవడానికి వెళ్లిన 21 మంది ఈజిప్టుకు చెందిన కైస్త్రవులను ఇస్లామిక్‌ స్టేట్‌ సంస్థ ఉగ్రవాదులు ఊచకోత కోసినట్లు ఐఎస్‌ విడుదల చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది.