ఐటి ఆధారిత చదువులకు పెద్దపీట

ఎపిలో సర్కార్‌ కసరత్తు

అమరావతి,జూన్‌ 29(జనం సాక్షి ): పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో ఐటి పట్ల అవగాహన కల్పించేందుకు ఎపి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు వసతులు ఉన్న పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా పాఠశాల విద్యలో నాణ్యతను పెంపొందించడం, విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పాదుగొలపడం, డిజిటల్‌ లిటరసీ.. ఈ ప్రాజెక్టు ఉద్దేశం. చెన్నయ్‌కి చెందిన క్రిసాలిస్‌ సంస్థ ఇందుకు సహకారం అందించనుంది. రాష్ట్రంలో కంప్యూటర్‌ లేబొరేటరీ సదుపాయం ఉన్న 343 ఉన్నత పాఠశాలలకు ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) కరికులమ్‌ అందుబాటులోకి రానుంది. ఇందులో 168 మోడల్‌ స్కూళ్లు, 175 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. నిపుణుల సహకారంతో రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఈ రివైజ్డ్‌ కరికులమ్‌ను రూపొందించింది. ఇందుకు అనుగుణంగా ఆయా స్కూళ్లలో ఇద్దరు సబ్జెక్టు టీచర్లు, ఒక కంప్యూటర్‌ ట్రైనర్‌ను ఏర్పాటు చేస్తారు. దశల వారీగా మరిన్ని పాఠశాలలకు విస్తరించనున్నారు. పాఠశాల విద్యా కమిషనర్‌ కె.సంధ్యారాణి ఈ ప్రాజెక్టు విషయంలో ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు.ప్రయోగాత్మకంగా ఆయా పాఠశాలల్లో ఈ ఏడాది 6 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు. ఇందుకోసం తొలిదశలో 1050 మంది ఉపాధ్యాయులకు పునఃశ్చరణ, శిక్షణ ఇస్తున్నారు. ఈ నెలలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో టీచర్లకు శిక్షణ ఇచ్చారు. మేరకు త్వరలోనే విద్యాశాఖ అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనుంది. వచ్చే ఏడాది నుంచి 9వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతి విద్యార్థులకు ఈప్రాజెక్టును విస్తరించనున్నారు. ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న 343 పాఠశాలల్లో కనీసం 40 లాప్‌టా ప్‌లు అందుబాటులో ఉన్నందునే ఎంపిక చేశారు.

—–