ఐదోసారి పోటీలో బిజెపి అభ్యర్థి ఆచారి

సానుభూతి గట్టెక్కిస్తుందన్న భరోసా

నేడు కెసిఆర్‌, రేపు అమిత్‌షాల ప్రచారం

ఆమనగల్లు,నవంబర్‌26(జ‌నంసాక్షి): కల్వకుర్తి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోరు పోటాపోటీగా సాగుతోంది. గత ఎన్నికల్లో కేవలం 73 ఓట్లతో గెలిచిన కాంగ్రెస్‌ నేత వంశీచంద్‌ రెడ్డి మరోమారు బరిలోక్‌ఇ దిగగా, బిజెపి అభ్యర్థి ఆచారి సానుభూతితో ముందుకు సాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఆచారి ఐదోసారి బరిలో నిలి చారు. నాలుగు సార్లు ఓడిపోయాడన్న సానుభూతి సర్వ త్రా వ్యక్తమవుతోంది. ప్రజాసమస్యలపై ఆచారి అలుపెరుగని పోరాటాలు చేస్తూ మాస్‌ లీడర్‌గా గుర్తింపు పొందారు. ఆయనకు మద్దతుగా ఇటీవల ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ ప్రచారం సాగించారు. డిసెంబర్‌ 2న ఆచారికి మద్దతుగా ఆమనగల్లులో నిర్వహించే సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నారు. ఏ విధంగానైనా గెలవాలని ఆచారి సాగిస్తున్న పోరాటానికి పార్టీ శ్రేణులంతా కలిసి రావడం, ఇతర మండలాల్లో కూడా చాప కింది నీరులా పాగా వేయడం ఆయనకు కలిసొచ్చిన అంశం. ఏది ఏమైనా కల్వకుర్తిలో రసవత్తర పోరు సాగుతోంది. ప్రజల్లో కూడా విపరీతంగా ఆయన సానుభూతిని కూడగట్టారు. కల్వకుర్తి అసెంబ్లీ స్థానానికి 15 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్యే ఉంది. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ తరపున తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌ రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజు ఆచారి పోటీలో ఉన్నారు. త్రిముఖ పోటీలో గెలుపెవరిదో అని ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి పోటీ చేసిన ముగ్గురు పాత ప్రత్యర్థులే మళ్లీ ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. ప్రధాన పార్టీలు విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ సారైనా గులాబీ జెండా ఎగర వేసి పరువు కాపాడుకోవాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుర్క జైపాల్‌యాదవ్‌, మళ్లీ రెండో సారి విజయ బావుటా ఎగర వేసి పట్టు నిలుపు కోవాలని కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌ రెడ్డి, ఐదోసారైన విజయం సాధించి సత్తా చాటుకోవాలని బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి సర్వశక్తులొడ్డుతున్నారు. అయితే ప్రజలు కూడా ఎటన్నది ఇప్పుడే స్పష్టం కావడం లేదు. ఏ పార్టీ వారు సభలు, సమావేశాలు నిర్వహించినా, ర్యాలీలు చేపట్టినా, ప్రజలు భారీ స్థాయిలో వస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, సమస్యలపై ఉన్న అవగాహనను చూసి జనం తనను ఆదరిస్తారని, గెలుపు సునాయాసమన్న ధీమాలో జైపాల్‌ యాదవ్‌ ఉన్నారు. ఇప్పటికే ఆయనకు మద్దతుగా మంత్రులు కేటీ ఆర్‌, జూపల్లి, లక్ష్మారెడ్డిలు ప్రచారం సాగించారు. ఈనెల 27న సీఎం కేసీఆర్‌ ఆమనగల్లుకు రానున్నారు. ఆది నుంచి కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు గట్టిపట్టుండడంతో పాటు కూటమిలోని టీడీపీ, టీజేఎస్‌, సీపీఐల అదనపు బలంతో తన గెలుపు

సునాయాసమని వంశీచంద్‌ రెడ్డి విశ్వాసంతో ఉన్నారు. అయితే సానుభూతి తనను గెలపిస్తుందన్న ధీమాలో బిజెపి అభ్యర్థి ఆచారి ఉన్నారు. అమిత్‌షా రాకతో ప్రచారం వేడెక్కనుంది.