ఒకే వేదికపై సమరనాదం

తెలంగాణ రాష్ట్రం నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. నాలుగు దశా బ్దాలుగా సాగుతున్న ఆత్మగౌరవ పోరాటం. సుమారు వెయ్యి మంది బిడ్డలు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన న్యాయమైన కోరిక. వారి అమరత్వాన్ని స్ఫూర్తిగా మలుచుకొని విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, ప్రజా, కుల సంఘాలు రోడ్లమీదికి చేరి పోరుదారిపట్టాయి. ఊరువాడ ఏకమై ఉద్యమాన్ని సాగించింది. బళ్లు బంద య్యాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడళ్లలో చేరి పుస్తకాలను బతుక మ్మలుగా మలిచి పాటలు ఆడారు. 2009 ఎన్నికల్లో టీడీపీతో మహాకూట మిగా జతకట్టిన టీఆర్‌ఎస్‌ చావుదెబ్బతింది. కేవలం పది ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైంది. అన్ని పక్షాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తడటంతో గులాబీ అధినేత కొంతకాలం ఉద్యమానికి దూరమయ్యాడు. ఈక్రమంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పే మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచింది. ప్రజలంతా ఏకమై ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా ఉద్యమించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు హైదరాబాద్‌ ఆరో జోన్‌లో భాగమేనని నినదిం చారు. ప్రజాఉద్యమానికి అప్పటి రోశయ్య సర్కారు దిగివచ్చి, హైదరాబాద్‌ ఆరోజోన్‌లో భాగమేనంటూ అసెంబ్లీలో తీర్మానించింది. ఈ ఉద్యమాన్నే ఆసరాగా చేసుకుని సిద్దిపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన కేసీఆర్‌ తెలంగాణ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ప్రకటిం చాడు. 2009 నవంబర్‌ 29న కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్‌ నుంచి సిద్దిపేటకు నిరాహార దీక్ష కోసం బయలు దేరిన కేసీఆర్‌ను పోలీ సులు అల్గునూరులో అరెస్టు చేసి ఖమ్మంకు తరలించారు. జైలులోనే దీక్ష కొనసాగిస్తానని ప్రకటించిన కేసీఆర్‌ మొదట దీక్ష విరమిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈక్రమంలో విద్యార్థులు, యువత ఆగ్రహం వ్యక్తం చేయ డంతో ఆయన దీక్ష కొనసాగించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరస్థితి విషమిం చడంతో ప్రభుత్వం నిమ్స్‌ ఆస్పత్రికి తరలించింది. అయినా మొండ ిపట్టుదళతో ఆయన దీక్ష కొనసాగించారు. తెలంగాణ ప్రజలంతా పార్టీలక తీతంగా ఏకమై టీఆర్‌ఎస్‌కు బాసటగా నిలిచారు. అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్య మంత్రి రోశయ్య, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, అప్పటి పీఆర్పీ ఎల్పీ పక్షనేత చిరంజీవి తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల మినిట్స్‌ ఆధారంగా డిసెంబర్‌ 9న అర్ధరాత్రి అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం నుంచి ప్రకటన వెలువడగానే ఇక్కడ నేతల్లో ఒక్క సారిగా పెనుమార్పు వచ్చింది. రాత్రికి రాత్రే ప్రకటన చేస్తారా అని చంద్ర బాబు అంటే, సామాజిక తెలంగాణ అంటూ ఓట్లు వేయించుకున్న చిరంజీవి సమైక్యాంధ్రకు జై కొట్టారు. కాంగ్రెస్‌, టీడీపీ, పీఆర్పీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ చాంబర్‌ వద్ద క్యూ కట్టి మరీ రాజీనామాలు సమర్పించారు. సమైక్యాంధ్ర అనే స్పాన్సర్డ్‌ ఉద్యమాన్ని ఆయా పార్టీల నాయకులే కొందరితో సాగించారు. తెలంగాణ పాటలనే కాపీ కొట్టి రోడ్లపై పాడారు. విద్యార్థులను ఉసిగొల్పి యూనివర్సిటీల్లో ఆందోళనకు బీజం నాటారు. 12 రోజుల పాటు సాగిన స్పాన్సర్డ్‌ ఉద్యమం, సీమాంధ్ర నేతల డబ్బు సంచీలతో కేంద్రం డిసెంబర్‌ 23 రాష్ట్రంలో యథాతథ స్థితిని కొనసాగిస్తున్నట్లు పున: ప్రకటన చేసింది. నాలుగు దశాబ్దాల కల నెరవేరిందనుకున్న తెలంగాణ ప్రజానీకం బంగపా టుకు గురైంది. తెలంగాణపై ప్రకటన సోనియమ్మ పుట్టిన రోజు కానుకగా చెప్పుకున్న కాంగ్రెస్‌ నాయకుల ముఖం నల్లబడింది. ప్రజా ఉద్యమం మరో సారి ఉప్పెనలా లేచింది. ఇదే తెలంగాణ ఐక్య ఉద్యమానికి పురుడు పోసింది. కేసీఆర్‌ స్వయంగా కోదండరామ్‌ ఇంటికి వెళ్లి ఉద్యమానికి నేతృత్వం వహించాలని కోరాడు. ఇలా ఆవిర్భవించిందే తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి. కోదండరామ్‌ కన్వీనర్‌గా ఏర్పడిన జేఏసీలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష టీడీపీ, టీఆర్‌ఎస్‌, బీజేపీ, న్యూడెమోక్రసీ తదితర పార్టీ లు, ప్రజాసంఘాలు భాగస్వాములుగా చేరాయి. జేఏసీ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, మంత్రులు పదవులకు రాజీనామాలు సమర్పించారు. రోడ్లతో ప్రజలపైకి చేరి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిం చారు. ఏమైందో ఏమోగాని క్రమక్రమంగా కాంగ్రెస్‌, టీడీపీలు జేఏసీకి దూరమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ప్రకటనకు నిరసనగా ప్రజాప్రతినిధులు చేసిన రాజీనామాలను లోక్‌సభ, శాసనసభ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్లు తిరస్కరించారు. తర్వాత మళ్లీ ప్రజల కోరిక మేరకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజాక్షేత్రానికి వెళ్లారు. ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు. తెలంగాణవాదాన్ని బతికించేందుకు మిగతా పార్టీలకు కనీసం డిపాజిట్‌ కూడా దక్కకుండా చేశారు. ఉద్యమం ఆగిపోకుండా జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటించి ముందుకుసాగారు. అయినా కేంద్రం నుంచి స్పంద న లేకపోవడంతో ఉద్యోగులు, కార్మికులు సకల జనుల సమ్మెకు వెళ్లారు. సింగరేణి బొగ్గు గనుల్లో తట్టాచెమ్మాస్‌ కదలలేదు. ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కార్య కలాపాలు పూర్తిగా స్తంభించాయి. నలభై రోజులకు పైగా సాగిన సమ్మెతో కేంద్రం దిగివచ్చి సంప్రదింపుల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కానీ తదనంతరకాలంలో కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో చాప్టర్‌ అమలులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ మీడియా మేనేజ్‌మెంట్‌, ఉద్యమ నేతలను బుజ్జగించే పనిలో పడింది. ఫలి తంగా మంత్రులు మెత్తపడ్డారు. టీ కాంగ్రెస్‌, టీ టీడీపీ ఫోరం పేరుతో ఆయా పార్టీల తెలంగాణ ప్రాంత నేతలు వేర్వేరుగా ఉద్యమాలు చేపట్టారు. ఈక్రమంలో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్‌గా గెలిచిన రాజేశ్వర్‌రెడ్డి మృతితో ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికలు జేఏసీ, టీఆర్‌ఎస్‌ మధ్య దూరాన్ని పెంచాయి. పరకాల ఉప ఎన్నికల సమయంలో జేఏసీ ఆలస్యంగా టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ అధినేత బాహాటంగానే జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌పై అసంతృప్తి వెల్లగక్కారు. కానీ కోదండరామ్‌ మాత్రం ఎక్కడా టీఆర్‌ఎస్‌తో విభేదాలున్నట్లు చెప్పలేదు. అం దరినీ కలుపుకుని ఉద్యమిస్తామని ప్రకటించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీతో సంప్రదింపుల అనంతరం హైదరాబాద్‌కు తిరిగివచ్చిన కేసీఆర్‌, జేఏసీతో వైరం మంచిదికాదని భావించాడు. చివరికి కోదండరామ్‌ ఇంటికి వెళ్లి ఐక్య ఉద్యమాలు చేద్దామని ప్రతిపాదించాడు. ఆయన పిలుపుమేరకు ఆదివారం సాయంత్రం సూర్యాపేటలో నిర్వహించిన బహిరంగ సభకు కోదండరామ్‌ హాజరయ్యారు. చాలా కాలం తర్వాత వారిద్దరూ ఒకే వేదికపై నుంచి ప్రసం గించారు. ఈ పరిణామం తెలంగాణవాదుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. హుషారుగా ఉద్యమించేందుకు తెలంగాణలోని పల్లెపల్లె సిద్ధమవుతున్నారు.